
మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన మూవీ ‘కన్నప్ప’ (Kannappa). ప్రభాస్ (Prabhas), అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ ఇలా భారీ తారాగణం నటించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో (ఈనెల 27న) థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. తమ సినిమాకు గానీ, వాటాదారుల పరువుకు గానీ నష్టం కలిగించేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
అన్నిరకాల చట్టపరమైన అనుమతులతో..
‘‘24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మితమైన ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నటీనటుల అపారమైన కృషి, భారీ బడ్జెట్‌తో అద్భుతమైన చిత్రంగా ఇది రూపొందింది. అన్నిరకాల చట్టపరమైన అనుమతులతో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. ప్రేక్షకులకు చేరువయ్యేలా బాధ్యతాయుతంగా దీనిని సిద్ధం చేశాం. విమర్శకులందరూ ముందుగా ఈ చిత్రాన్ని వీక్షించి.. అందులోని సారాంశాన్ని అర్థం చేసుకొని, ఎలాంటి పక్షపాతాలకు లొంగకుండా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతున్నాం. భారత రాజ్యాంగంలోని వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను మేము గౌరవిస్తున్నప్పటికీ.. సినిమాను కించపరిచేలా వ్యవహరిస్తే మాత్రం తప్పకుండా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
అవాంతరాలను దృష్టిలోఉంచుకొని
‘కన్నప్ప’కు సంబంధించిన ఇద్దరు కీలక భాగస్వాములు, ప్రధాన నటులు మోహన్‌బాబు, మంచు విష్ణు వ్యక్తిత్వానికి, ప్రచార హక్కులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఇప్పటికే దిల్లీ హైకోర్టు వారికి రక్షణ కల్పిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వారి ఇమేజ్‌ను భంగపరిచేలా వ్యవహరిస్తే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో జరిగిన అవాంతరాలను దృష్టిలోఉంచుకొని బృందం అప్రమత్తమైంది’’ అని టీమ్ పేర్కొంది. సివిల్, క్రిమినల్, సైబర్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.