మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’((Viswambhara) ) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టును భారతీయ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ స్థాయిలో కొత్త మైలురాయిగా నిలిపేలా రూపొందించేందుకు చిత్ర బృందం కృషి చేస్తోంది. ఇప్పటివరకు మనం చూసిన సినిమాల కంటే భిన్నంగా, ఓ విభిన్న సినిమాటిక్ అనుభూతిని అందించాలనే లక్ష్యంతో విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పని చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌కు చెందిన టాప్ వీఎఫ్ఎక్స్ స్టూడియోలు కలిసి ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా అత్యున్నత నాణ్యతతో విజువల్స్ అందించేందుకు సాంకేతిక బృందం అహర్నిశలు శ్రమిస్తోంది. ఈ సినిమాలో మొత్తం 4 వేలకు పైగా వీఎఫ్ఎక్స్(VFX) షాట్స్ ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. సినిమాలో ఇవే హైలైట్ కానున్నాయని అంటున్నారు.
‘బింబిసార’తో విజయాన్ని సాధించిన దర్శకుడు వశిష్ఠ, ‘విశ్వంభర’ను తన డ్రీమ్ ప్రాజెక్టుగా భావించి ఎంతో విజన్‌తో తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. నిర్మాతలు విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. పురాణ గాథలతో పాటు భావోద్వేగాలు, అద్భుతమైన విజువల్స్‌ను మిళితం చేస్తూ రూపొందుతున్న ‘విశ్వంభర’లో చిరంజీవితో పాటు త్రిష కృష్ణన్, ఆషికా రంగనాథ్ నటిస్తుండగా, కునాల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చిత్ర యూనిట్ అవుట్‌పుట్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉందని తెలుస్తోంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.






