రోజు వారి ఆదాయం బాగానే ఉన్నా… చాలా మంది అప్పుల్లో కూరుకుపోయి ఏమి చేయాలో తెలియక తీవ్ర ఆందోళనకు లోనవుతుంటారు. కానీ అమెరికాలోని డెలావేర్కు చెందిన జెన్నిఫర్ అనే రియల్టర్ మాత్రం తన ఆర్థిక సంక్షోభానికి వినూత్న పరిష్కారం కనుగొంది – అది చాట్‌జీపీటీ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ సాయంతో ఆమె నెలరోజుల్లోనే రూ.10 లక్షల అప్పు తీర్చగలిగింది.
జెన్నిఫర్ గర్భవతిగా ఉన్న సమయంలో, తన ఆరోగ్య అవసరాలు మరియు ఇంటి ఖర్చుల కోసం క్రెడిట్ కార్డులను వాడింది. షాపింగ్, జల్సాలు చేయకుండా కేవలం అవసరాల కోసమే అప్పు తీసుకున్నప్పటికీ, అది క్రమంగా పెరిగి రూ.20 లక్షల దాకా చేరింది. మంచి ఆదాయం ఉన్నా ఆమెకి అప్పు తీర్చడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిలో ఆమెకి ఒక్కటే ఆలోచన చాట్‌జీపీటీని అడగడం.
ఆమె తన ఆదాయం, నెలవారీ ఖర్చులు, క్రెడిట్ కార్డు బాకీలు అన్నింటినీ చాట్‌జీపీటీకి వివరించింది. అప్పుడే ఈ AI టూల్ ఆమెకు తక్కువ సమయంలోనే వ్యయ నియంత్రణ, పొదుపు మార్గాలు, అప్పు తగ్గించుకునే ఫైనాన్షియల్ ప్లాన్‌ను సూచించింది. ఖర్చులు ఎక్కడ తగ్గించాలో, ఏమి మార్చాలో స్పష్టంగా చిట్‌చాట్ రూపంలో వివరించింది.
జెన్నిఫర్ ఆ మార్గాలను కచ్చితంగా అమలు చేయడంతో కేవలం 30 రోజుల్లోనే రూ.10 లక్షల అప్పును తీర్చగలిగింది. మిగిలిన అప్పు కూడా మరో నెలలో పూర్తవుతుందని ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది.
ఈ సంఘటన ఎంతో మందికి స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది – సమస్యలు పెద్దవైనా సరే, సరైన మార్గం తెలుసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. చాట్‌జీపీటీ వంటి టెక్నాలజీని తెలివిగా వాడుకుంటే, ఆర్థిక ఒత్తిడికి స్వస్తి చెప్పడం అసాధ్యం కాదు.






