తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటుడిగా, విభిన్న పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కోట శ్రీనివాసరావు(Kota Srinivasa Rao) కన్నుమూశారు. జూలై 10న తన 83వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకున్న ఆయన, కేవలం మూడురోజుల్లోనే అంటే జూలై 13 ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో సినీ పరిశ్రమతో పాటు అభిమానుల్లో కూడా తీవ్ర విషాదాన్ని నింపింది.
కుటుంబ సభ్యుల ఆవేదన..
ఆయన మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. “పుట్టినరోజు నాడు ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నారు. అందరితో కలిసిమెలిసి మాట్లాడారు. ఇంకొన్ని రోజులు మాతో ఉంటారని ఆశించాం. కానీ ఇంత త్వరగా మమ్మల్ని వదిలిపెత్తుతారని ఊహించలేదు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా, చివరి వరకు ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరదు” అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.
బాబు మోహన్ భావోద్వేగం
కోట శ్రీనివాసరావుతో అత్యంత సన్నిహితంగా ఉన్న నటుడు బాబు మోహన్. కోటతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆయన మరణవార్త విని భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘శనివారం రాత్రే కోట అన్నతో మాట్లాడాను. అంతలోనే ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. ఆయన నాకు అన్న, స్నేహితుడిగా ఉండే వారు. నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు. కోట అన్న లేని లోటు నాకు వ్యక్తిగతంగా, తెలుగు సినిమా పరిశ్రమకూ తీరనిది” అని కంటతడి పెట్టారు.
కోట శ్రీనివాసరావు సినీ ప్రపంచంలో సృష్టించిన ముద్ర చిరకాలం నిలిచిపోతుంది. ఆయన ఆకస్మిక మరణం సినీ లోకానికి తీరని లోటు. కోట మరణంపై చిరంజీవి సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.






