పుదుచ్చేరి(Puducherry)కి చెందిన ప్రముఖ మోడల్, బ్యూటీ క్వీన్ శాన్ రాచెల్ (San Rechal) ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవల కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె, జూన్ 5న అధిక మోతాదులో రక్తపోటు మాత్రలు తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె వయసు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే.
పోలీసుల ప్రకారం, శాన్ రాచెల్(Shan rachel)ను శంకరప్రియ అనే పేరుతో కూడా పిలిచేవారు. శాన్ తన చర్మ రంగు కారణంగా చిన్ననాటి నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. అయినప్పటికీ, రంగుతో సంబంధం లేకుండా తన ప్రతిభతో మోడలింగ్ రంగంలో ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఆమె 2019లో మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు, మిస్ బెస్ట్ యాటిట్యూడ్ టైటిల్స్ గెలుచుకోగా, 2020–21లో మిస్ పుదుచ్చేరిగా కూడా ఎంపికైంది. అంతేకాదు, అంతర్జాతీయ స్థాయిలో మిస్ వరల్డ్ బ్లాక్ బ్యూటీ (Miss World Black Beauty) టైటిల్‌ను కూడా కైవసం చేసుకుంది.
ఫ్యాషన్ షోలు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ, హోస్ట్ చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శాన్ రాచెల్, ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణలో ఆమె గదిలో సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన మరణానికి భర్త లేదా అత్తింటి వారు బాధ్యులు కాదని స్పష్టంగా పేర్కొంది. ఫ్యాషన్ షోలు, ఇతర కార్యక్రమాల నిర్వహణలో వచ్చిన ఆర్థిక నష్టాలే ఆత్మహత్యకు ప్రధాన కారణంగా నోట్‌లో వెల్లడించినట్లు తెలుస్తోంది.






