తెలుగు చిత్రసీమలో మరో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్(Fish Venkat) (అసలు పేరు మంగిలంపల్లి వెంకటేశ్) శుక్రవారం రాత్రి (జూలై 18) తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ హైదరాబాద్(Hyderabad)లోని RBM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
గత కొంతకాలంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో పాటు, డయాబెటిస్, హై బీపీ వంటి ఆరోగ్య సమస్యలతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. వైద్యులు కిడ్నీ మార్పిడి అవసరం అని సూచించినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవసరమైన చికిత్స అందించలేకపోయారు కుటుంబ సభ్యులు. చివరిదశలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి మరింత విషమించి మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు.
ఫిష్ వెంకట్ మృతికి సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ఆయన అంత్యక్రియలపై ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిష్ వెంకట్ అంత్యక్రియలు ఇవాళ (జూలై 19) మధ్యాహ్నం 1 గంట తర్వాత హిందూ సాంప్రదాయబద్ధంగా జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రస్తుతం ఆయన పార్ధివ దేహాన్ని హైదరాబాద్‌లోని అడ్డగుట్టలో ఉన్న నివాసంలో ఉంచారు. అభిమానులు, సన్నిహితులు, టాలీవుడ్ సెలెబ్రిటీలు ఆయనకు చివరిసారి నివాళులర్పించేందుకు అక్కడికి తరలివస్తున్నారు. అనంతరం మారేడ్‌పల్లి లోని హిందూ స్మశాన వాటికలో ఫిష్ వెంకట్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.






