ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఇప్పుడు తన సేవలను మరింత అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో పలు కీలక మార్పులను ప్రతిపాదించింది. అందులో భాగంగా, పీఎఫ్(PF) ఖాతాల నుంచి డబ్బు విత్డ్రా(Withdraw) చేసుకునే నిబంధనల్లో సడలింపు రానుందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం, ఉద్యోగి(Emplayee) 58 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ చేసిన తర్వాత లేదా ఉద్యోగం వదిలిన రెండు నెలల తర్వాత మాత్రమే మొత్తం పీఎఫ్ ను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. కానీ, కొత్త ప్రతిపాదన ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సభ్యులు తమ పీఎఫ్ మొత్తాన్ని లేదా దానిలో కొంత భాగాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే, కెరీర్ మిడిల్లో మార్పులు చేయాలనుకునే వారికి, లేదా ప్రత్యేక పరిస్థితుల్లో ఉద్యోగం వదిలినవారికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆలోచన చేస్తోంది.
అంతేకాకుండా, యూపీఐ లేదా ఏటీఎం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో లక్ష రూపాయల వరకు తక్షణ విత్డ్రా చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ గరిష్ట పరిమితి త్వరలోనే రూ.5 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం విత్డ్రావల్ కోసం అవసరమైన డాక్యుమెంట్ల సంఖ్యను 27 నుంచి 18కి తగ్గించగా, క్లెయిమ్ ప్రక్రియ మూడు నుంచి నాలుగు రోజుల్లోనే పూర్తవుతోంది. ముఖ్యంగా, 3 సంవత్సరాల సేవ తర్వాత హౌస్ ఈఎంఐ లేదా డౌన్ పేమెంట్ కోసం పీఎఫ్ మొత్తంలో 90% వరకు విత్డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించనున్నట్టు సమాచారం.






