
తెలుగు రాష్ట్రాల్లో ముసురు వానల(Rains)తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. మరోవైపు సూర్యరశ్మి లేకపోవడంతో సీజనల్ వ్యాధులు(Seasonal diseases) ప్రబలుతున్నాయి. దోమలు, ఈగలు విజృంభిస్తున్నాయి. దీంతో జలుబు, జ్వరం, దగ్గుతో పాటు కీళ్లనొప్పులతో జనం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. అయితే బంగాళాఖాతంలో పుట్టిన అల్పపీడనం వాయుగుండంగా మారినా.. ప్రస్తుతం అది కొంత బలహీనపడిందని వాతావరణశాఖ తెలిపింది. దీని వల్ల తెలుగు రాష్ట్రాలపై క్రమంగా తగ్గినా వర్షాలు కురుస్తాయని తెలిపింది.
తెలంగాణలో ముసురు వానలే
భారత వాతావరణ శాఖ(IMD) తాజా బులిటెన్లో ఇవాళ( జులై 27) ఏపీ, తెలంగాణ(Telangana)లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే చాలా ప్రాంతాల్లో ముసురు వర్షాలే తప్ప భారీ వర్షాలకు ఛాన్స్ లేదని తెలిపింది. అయితే ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఇప్పటికే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈరోజు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఏపీలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వానలు(Rains) బీభత్సంగా కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, మన్యం, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు కోరుతున్నారు. అటు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ మధ్య ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఇదే సమయంలో సముద్రంలో అలజడి ఉంటుందని, బుధవారం వరకు రాష్ట్రంలోని తీరప్రాంత మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.