కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rains) కారణంగా కృష్ణా నది(Krishna river)లో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయాని(Srisailam Reservoir)కి ఎగువ ప్రాంతాలైన జూరాల(Jurala), సుంకేసుల(Sunkesula) ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం జలాశయానికి 1,02,580 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా ఔట్ ఫ్లో 1,13,115 క్యూసెక్కులుగా నమోదైంది. ఈ నీటిని నియంత్రించేందుకు అధికారులు ఒక గేటును ఎత్తి 26,698 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టు(Nagarjunasagar Project)కు విడుదల చేశారు.
కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి
శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882 అడుగుల వద్ద ఉంది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు, ప్రస్తుతం 198.81 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద ప్రవాహం(flood flow) కొనసాగుతుండటంతో, దిగువ ప్రాంతాల్లోని అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాయలసీమ ప్రాంతంలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చడానికి ఈ నీరు ఉపయోగపడుతోంది. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి(Power generation) కూడా కొనసాగుతోంది. వర్షాలు మరింత ఉధృతమైతే, మరిన్ని గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.






