ఫ్రాన్స్‌లోని పూయ్-డీ-డోమ్ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న పట్టణం అంబర్ట్ (Ambert) స్థానిక జనాభా తగ్గిపోతుండటంతో నూతన నివాసితులను ఆకర్షించేందుకు వినూత్న ఆఫర్ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా, అక్కడి పురాతన ఇళ్లు కేవలం 1 యూరో (రూ.100)కి అమ్మకానికి పెడుతున్నారు.
19వ శతాబ్దం నుంచే ఈ పట్టణం నుంచి ప్రజలు నగరాలకు వలస వెళ్తూ ఉండటంతో జనాభా నానాటికి తగ్గుతోంది. ప్రస్తుతం ఈ పట్టణంలో కేవలం 6,500 మంది మాత్రమే నివసిస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చేందుకు అక్కడి ప్రభుత్వం ఐదేళ్ల ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా పురాతన, ఖాళీగా ఉన్న ఇళ్లను ప్రతీ ఒక్కరూ కొనుగోలు చేయేలా చర్యలు తీసుకుంటున్నారు.
అయితే ఈ ఇళ్లను కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా మరమ్మతులు చేయాల్సిందే. ఇందుకోసం కనీసం రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు అవొచ్చు. ఇల్లు కొనుగోలు సమయంలో ఓ అంగీకార పత్రంపై సంతకం చేయించి, నిర్ణీత కాలంలో ఇంటిని పునర్నిర్మించాలి.
ఈ పథకానికి విదేశీయులు కూడా అర్హులు. అంతేకాదు, మరమ్మతుల కోసం తక్కువ వడ్డీపై లోన్లు, ప్రభుత్వ సహాయాలు కూడా అందించనున్నారు. ఇంటిని కొన్న తరువాత, కనీసం 3 ఏళ్లు అక్కడ నివసించాల్సిన నిబంధన ఉంటుంది. ఫ్రెంచ్ భాష తప్పనిసరి కాదు కానీ, అక్కడి ప్రజలతో కలిసిపోయేందుకు నేర్చుకుంటే మంచిదని అధికారులు చెబుతున్నారు.






