తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల్ని అత్యధికంగా ఆకట్టుకున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు తొమ్మిదో సీజన్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 7, 2025 నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9( Bigg Boss 9) ప్రారంభం కానుంది.
గత ఆరు సీజన్లుగా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున(Nagarjuna) ఈ సీజన్‌కి కూడా హోస్ట్‌గా కొనసాగనున్నారు. ఆయన తీసుకుంటున్న పారితోషికం(remuneration ) ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిగ్ బాస్ 9వ సీజన్ కోసం నాగార్జున దాదాపు రూ.30 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం. గత సీజన్లలోనూ ఆయన ఇలానే భారీ పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.
ఈ షో 2017లో ప్రారంభమైంది. మొదటి సీజన్‌కి ఎన్టీఆర్, రెండో సీజన్‌కి నాని హోస్ట్ చేశారు. మూడో సీజన్ నుండి నాగార్జునే హోస్ట్‌గా కొనసాగుతున్నారు. బిగ్ బాస్ కేవలం హోస్ట్‌కే కాదు, షోలో పాల్గొనే కంటెస్టెంట్లకు కూడా లక్షల రూపాయల పారితోషకం, విజేతలకు సుమారు రూ.50 లక్షల నగదు బహుమతి లభిస్తాయి.
ఈసారి షోలో పలు మార్పులు, కొత్త కాన్సెప్టులు తీసుకురాబోతున్నట్లు సమాచారం. సీక్రెట్ రూమ్, రీ ఎంట్రీ వంటి పాత ఐడియాస్‌ను తొలగించి, కొత్త టాస్కులు, సర్ప్రైజ్ రూల్స్ ప్రవేశపెట్టనున్నారు. సరికొత్త హంగులతో, రసవత్తర టాస్కులతో కూడిన బిగ్ బాస్ 9 ఇంకొద్ది రోజుల్లో ప్రారంభం కానుండగా, హోస్ట్ నాగార్జున పారితోషికం, కంటెస్టెంట్ల జాబితా వంటి అంశాలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.






