బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ క్రికెట్ సెలక్షన్(National Cricket Selection Committee) కమిటీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. సీనియర్ పురుషుల, మహిళల, జూనియర్ సెలక్షన్ కమిటీలలో పలు ఖాళీలను భర్తీ చేసేందుకు శుక్రవారం దరఖాస్తుల(Applications)ను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం అజిత్ అగార్కర్(Ajith Agarkar)నేతృత్వంలోని సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలో రెండు ఖాళీలు ఏర్పడనున్నాయి.
కొత్తవారిని తీసుకునే విషయంపై త్వరలోనే స్పష్టత
ఈ కమిటీలో అగార్కర్‌తో పాటు ఎస్ఎస్ దాస్(SS Das), సుబ్రతో బెనర్జీ, అజయ్ రాత్రా, ఎస్. శరత్ సభ్యులుగా ఉన్నారు. సెలక్టర్ల కాంట్రాక్టులను ఏటా పునరుద్ధరిస్తామని, ప్రస్తుతం ఎవరి స్థానంలో కొత్తవారిని తీసుకుంటామనే విషయంపై త్వరలోనే స్పష్టత వస్తుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల ఆసియా కప్(Asia Cup 2025) కోసం జట్టును ఎంపిక చేసింది ఈ కమిటీనే.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హతలివే..
సెలక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హత ప్రమాణాలలో ఎలాంటి మార్పులు చేయలేదు. కనీసం ఏడు టెస్టు(Test) మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉండాలి. లేదా 10 వన్డే ఇంటర్నేషనల్స్ (ODI) లేదా 20 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు, నీతూ డేవిడ్ నేతృత్వంలోని మహిళల జాతీయ సెలక్షన్ కమిటీలో ఏకంగా నాలుగు స్థానాల భర్తీకి బీసీసీఐ నోటిఫికేషన్(BCCI Notification) విడుదల చేసింది. అండర్-22 స్థాయి వరకు జట్లను ఎంపిక చేసే జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీలో కూడా ఒక సభ్యుడి స్థానం ఖాళీగా ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 10వ తేదీలోగా సమర్పించాలని బోర్డు సూచించింది.






