ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖ మంచి అవకాశాన్ని కల్పించింది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉద్యోగులు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే విధంగా ‘స్వయం పోర్టల్’ ద్వారా ఉచిత ఏఐ కోర్సులను( Free AI courses) అందిస్తోంది. ఈ కోర్సులు విభిన్న రంగాలకు అనుగుణంగా రూపొందించబడి ఉండటం విశేషం.
ఏఐ/ఎంఎల్ యూసింగ్ పైథాన్
ఈ కోర్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రాథమిక అంశాలను పరిచయం చేస్తుంది. స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, ఆప్టిమైజేషన్, డేటా విజువలైజేషన్ వంటి కీలక అంశాలతో పాటు డేటా సైన్స్‌లో విస్తృతంగా ఉపయోగించే పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు. ఇది 36 గంటల కోర్సు, పూర్తయ్యాక సర్టిఫికేట్ ఇస్తారు.
క్రికెట్ అనలిటిక్స్ విత్ ఏఐ
ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు అందించే ఈ ప్రత్యేక కోర్సులో క్రికెట్‌ను ఉదాహరణగా తీసుకుని పైథాన్‌తో స్పోర్ట్స్ అనలిటిక్స్ నేర్పిస్తారు. ఇది 25 గంటల కోర్సు.
ఏఐ ఇన్ ఫిజిక్స్
ఈ కోర్సు ద్వారా మెషిన్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్ వాస్తవ ప్రపంచ భౌతిక శాస్త్ర సమస్యలను ఎలా పరిష్కరించగలవో నేర్చుకోవచ్చు. ఇంటరాక్టివ్ సెషన్లు, ప్రాక్టికల్ ఉదాహరణలు, ల్యాబ్ వర్క్ ఉంటాయి. వ్యవధి 45 గంటలు.
ఏఐ ఇన్ అకౌంటింగ్
కామర్స్, మేనేజ్మెంట్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ కోర్సు అకౌంటింగ్ పద్ధతుల్లో ఏఐ వినియోగంపై దృష్టి పెడుతుంది. ఇది 45 గంటల కోర్సు.
ఏఐ ఇన్ కెమిస్ట్రీ
ఈ కోర్సు ద్వారా రసాయన శాస్త్ర డేటాసెట్లను ఉపయోగించడం, పరమాణు లక్షణాలు విశ్లేషించడం, మోడల్ ప్రతిచర్యలు అంచనా వేయడం, డ్రగ్ డిజైన్‌లో ఏఐ వినియోగం వంటి అంశాలు నేర్చుకోవచ్చు. ఇది కూడా 45 గంటల కోర్సు.






