ManaEnadu:దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై పలువురు నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కవిత సోదరుడు కేటీఆర్ స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ‘‘థాంక్యూ సుప్రీంకోర్టు. ఊరట లభించింది.. న్యాయం గెలిచింది’’ అని ఆ పోస్టులో ఆయన పేర్కొన్నారు.
ఇది కాంగ్రెస్-బీఆర్ఎస్ విజయం
అయితే ఇదే వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ న్యాయవాదులకు అభినందనలు అని ఎద్దేవా చేశారు. తమ అలుపెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయని.. ఈ బెయిల్ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండింటి విజయమని ఎక్స్ లో పోస్టు చేశారు. బీఆర్ఎస్ నేత బెయిల్‌పై బయటకు రాబోతున్నారన్న బండి సంజయ్.. కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు ఎంపికయ్యారని.. బెయిల్ కోసం మొదట వాదించిన వ్యక్తి పోటీ చేస్తే.. ఆ అభ్యర్థికి (అభిషేక్ మను సింఘ్విని ఉద్దేశిస్తూ) మద్దతు ఇచ్చి కేసీఆర్ రాజకీయ చతురత ప్రదర్శించారని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.
ఇది కోర్టు ధిక్కారమే..
బండి సంజయ్ కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సుప్రీంకోర్టుకు ఉద్దేశాలు ఆపాదించేలా కామెంట్స్ చేశారని.. కేంద్రమంత్రిగా ఉంటూ ఇంత చౌకబారుగా మాట్లాడుతారా అని మండిపడ్డారు. దురుద్దేశపూర్వకంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టుకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.