ManaEnadu:బాహబలి (Bahubali), ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై సగౌరవంగా నిలబెట్టాయి. ఆ తర్వాత చాలా సినిమాలు అలాగే విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. పలు సినిమాలు విదేశీ భాషల్లో కూడా డబ్ అవుతున్నాయి. అలా అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఇక తాజాగా రష్యాలో జరుగుతున్న మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్(Moscow International Film Festival)లో మన తెలుగు సినిమాలు ఆకట్టుకున్నాయి.
ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆర్ఆర్ఆర్ (RRR Movie)’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ రూపొందించిన ‘కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)’ సినిమాలను మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్‌లో ప్రదర్శించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్యా ప్రేక్షకులకు ఇండియన్ సినిమాలంటే ప్రేమ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. అందువల్లే తాజాగా ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి’ బ్లాక్ బస్టర్ చిత్రాలపై తమ ప్రేమను కురిపించారు. రెండేళ్ల క్రితం రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ రష్యాలోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుని మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే రష్యాలో తెలుగు సినిమాలకు పెరుగుతున్న ఆదరణ చూసి తాజాగా కల్కి (Prabhas Kalki Movie) మేకర్స్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కల్కి ప్రొడ్యూసర్స్.. స్వప్నదత్, ప్రియాంక దత్‌లు ‘కల్కి’ సినిమాను రష్యా భాషలో డబ్ చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో అక్కడ ఈ సినిమా విడుదల చేయనున్నట్లు అధికారికంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కల్కి సినిమా పాన్ ఇండియా చిత్రంగా భారత్‌లో విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇక ఆగస్టు 23వ న రష్యా రాజధాని మాస్కో వేదికగా ప్రారంభమైన ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రాలను ప్రదర్శించారు. టాలీవుడ్ నిర్మాతలు దిల్‌రాజు, స్వప్నదత్, ప్రియాంక దత్‌లు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ తమ సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇక మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ ఈనెల 28 వరకు జరగనుంది.






