Mana Enadu : ఏపీలో ఇచిత గ్యాస్ సిలిండర్ పథకం (Free LPG Cylinder Scheme) ప్రారంభమైన విషయం తెలిసిందే. ‘దీపం 2.0’ కింద ఇప్పటికే ఈ పథకానికి బుకింగ్స్ మొదలయ్యాయి. 31వ తేదీ నుంచి సిలిండర్లు కూడా అందిస్తున్నారు. అయితే ఈ పథకానికి తాము అర్హులమా కాదా? అని చాలా మంది లబ్దిదారులు అయోమయంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.
ఆధార్ లేకపోతే అర్హులు కారు
ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ (LPG Connection) ఆధారంగా రాయితీ వర్తింపజేస్తున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 1.54 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్ కనెక్షన్లు ఉండగా.. తాత్కాలిక అంచనా ప్రకారం ఉచిత సిలిండర్‌కు 1.08 కోట్ల కనెక్షన్లు అర్హత పొందాయని వెల్లడించారు. కానీ, రేషన్ కార్డులు (Ration Cards) 1.48 కోట్లు ఉన్నాయని.. కొంత మందికి గ్యాస్ కనెక్షన్, రేషన్ కార్డులున్నా.. ఆధార్ ఇవ్వకపోవడంతో అర్హత పొందలేకపోయారని చెప్పారు. వీరంతా ఆధార్ అనుసంధానించుకుంటే ‘దీపం 2.0 (Deepam 2.0)’ పథక అర్హుల సంఖ్య పెరుగుతుందని స్పష్టం చేశారు.
ఆధార్, రేషన్ తప్పనిసరి
వంటగ్యాస్ రాయితీ పొందాలంటే రేషన్ కార్డు, ఆధార్ (Aadhar Card), గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులలో ఎవరి పేరుమీద కనెక్షన్ ఉందో.. ఆ వ్యక్తి పేరు రేషన్ కార్డులో ఉంటే రాయితీ వస్తుందని వెల్లడించారు. భార్య పేరుతో రేషన్ కార్డు, భర్త పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉన్నా అర్హులేనని.. ఒక రేషన్ కార్డులోని సభ్యుల పేర్లతో రెండు/మూడు కనెక్షన్లున్నా.. రాయితీ ఒక్క కనెక్షన్‌కే వర్తిస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ (TDP) హయాంలో ఇచ్చిన దీపం కనెక్షన్లకూ ‘దీపం 2.0’ పథకం వర్తిస్తుందని.. గ్యాస్ రాయితీ జమ కావాలంటే ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని వివరించారు.
కేవైసీలో సమస్యలు
ఇక వంటగ్యాస్ రాయితీ పొందేందుకు ఈ కేవైసీ తప్పనిసరి అని ఇంధన సంస్థల డీలర్లు స్పష్టం చేశారు. గతంలో గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో ఈ కేవైసీ తీసుకోవాలని.. తర్వాత దాన్ని అమలు చేయలేదని తెలిపారు. ఇప్పటికైనా ఆ విధానం అమలయ్యేలా చూడాలని.. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బందితో అయినా ఈ కేవైసీ తీసుకోవాలని లబ్దిదారులు కోరుతున్నారు.






