‘సితారే జమీన్ పర్’లో (Sitaare Zameen Par) మానసిన దివ్యాంగులతో కలిసి నటించి మెప్పించిన అగ్ర హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) ప్రస్తుతం ఆ మూవీ విజయాన్ని ఆస్వాధిస్తున్నారు. ఈ సినిమా విజయం తర్వాత ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నటించి దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ‘తారే జమీన్ పర్’ (Taare Zameen Par) కూడా సూపర్ హిట్ అయ్యింది. అయినప్పటికీ ఆ సినిమా తర్వాత ఆమిర్ మళ్లీ దర్శకత్వం వహించలేదు. తాజాగా ఈ విషయంపై మాట్లాడారు.
అలా అయితే నటన బోరింగ్గా మారుతుంది
‘‘పూర్తిగా దర్శకుడిగా మారకపోవడానికి ఏకైక కారణం నటనపై నాకున్న ఇష్టమే. ఈ పరిశ్రమలో దర్శకత్వం, నిర్మాణం రెండూ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒకవేళ నేను దర్శకత్వం వైపు వెళ్తే నటన బోరింగ్‌గా అనిపిస్తుంది. బోర్ కొట్టిన పనిని నేను చేయలేను. కాబట్టి నటన మానేస్తాను. ‘తారే జమీన్ పర్’కు కూడా అనుకోని పరిస్థితుల్లో దర్శకత్వం వహించాను. అప్పుడు నేనున్న పరిస్థితులు అలా ప్రేరేపించాయి’’ అని చెప్పారు.
లోకేశ్తో సినిమా కోసం ఎదురుచూస్తున్నా
లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో నటించనున్న సినిమా గురించి కూడా మాట్లాడారు. అది సూపర్ హీరో సినిమా అని తెలిపారు. ‘‘లోకేశ్ చాలా టాలెంటెడ్. ఆయనతో కలిసి వర్క్ చేసేందుకు ఎదురుచూస్తున్నా. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి సమయం పడుతుంది. రాజ్‌కుమార్ హిరాణీ (Rajkumar Hirani)తో సినిమా పూర్తిచేశాక ఇందులో నటిస్తాను. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో దీన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి’ అని పేర్కొన్నారు. ఆమిర్తో రాజ్కుమార్ హిరాణీ తీసిన 3 ఇడియట్స్, పీకే ఎంతటి విజయం సాధించాయో తెలిసిందే. దీంతో వీరి కలయికలో వస్తున్న మరో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.






