బాలీవుడ్‌లో ప్రేమకథలు కొత్తేమీ కాదు. కానీ ప్రతి తరం ప్రేక్షకుడిని టచ్ చేసేలా కొన్ని కథలు మనసులో మిగిలిపోతాయి. ఇక అర్థాంతరంగా ముగిసిన ప్రేమకథలకూ బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ లభించింది. అలాంటి క్రమంలోనే దర్శకుడు మోహిత్ సూరి(Mohith Suri), ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yesh Raj Films) కలిసి తెరకెక్కిస్తున్న తొలి చిత్రం ‘సయారా’( Saiyaara) పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ట్రైలర్(Trailer) రిలీజై, ఇందులో ఉన్న భావోద్వేగాలు, సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో అహాన్ పాండే(Ahaan Panday) (అనన్య పాండేకి బంధువు) హీరోగా, కొత్త నటి అనీత్ పద్దా(Aneeth Padda) హీరోయిన్‌గా నటిస్తున్నారు. క్రిష్ యువ సింగర్‌కు, వాణి లిరిక్ రైటర్‌కు మధ్య జరిగే ప్రేమ కథ ఇది. ఇద్దరి మధ్య వచ్చే అభిప్రాయ భేదాలు, జీవిత విలువల మధ్య తలెత్తే పరిణామాలు వీరిద్దరి మధ్య ప్రేమ మొదలై, అనంతరం విరహంగా ఎలా మారిందన్నదే ప్రధానాంశం.
నూతన జంట అయినా, అహాన్, అనీత్ నటన సహజంగా ఉండడం ట్రైలర్‌లోనే కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ ఈ కథకు ప్రాణంగా నిలుస్తోంది.
మోహిత్ సూరి గతంలో ‘ఆషికీ 2’(Ashiqui2), ‘ఏక్ విలన్’, ‘రాజ్ 2’ వంటి భావోద్వేగ ప్రేమకథలతో తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు అదే భావోద్వేగాన్ని *‘సయారా’*లో పునరావృతం చేయనున్నాడన్న అంచనాలు ఉన్నాయి. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 18న థియేటర్లలో విడుదల కానుంది.






