Mana Enadu : హైదరాబాద్ ఫార్ములా ఈ-రేసు (Formula E Race Case) కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారం గురించి ఫిర్యాదు చేసిన.. ఫిర్యాదుదారుడు, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ (Dana Kishore) వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు నమోదు చేశారు. ఈ స్టేట్మెంట్ ఆధారంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ (KTR), పురపాలకశాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇందుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
దాన కిశోర్ ఫిర్యాదు
ఫార్ములా ఈ-రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా గత సర్కార్ లోని కొందరు విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ దాన కిశోర్ ఈ ఏడాది అక్టోబరు 18వ తేదీన ఏసీబీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రభుత్వానికి రూ.54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ (KTR Case)ను ఇందులో ఏసీబీ ప్రధాన నిందితుడి (A1)గా పేర్కొంది.
రంగంలోకి ఈడీ
ఈ వ్యవహారంలోనే ఇటీవల కేటీఆర్ (KTR ACB Case) పై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. పురపాలకశాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ను (A2)గా, హెచ్‌ఎండీఏ అప్పటి చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డి (ఏA3)గా పేర్కొంటూ వారి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. మరోవైపు ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందని రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా దిగింది. ఈడీ అధికారులు ఏసీబీ నుంచి వివరాలు సేకరించి ఈ కేసులో దర్యాప్తును సాగిస్తున్నారు.







