తమిళ నటుడు ఆర్.మాధవన్ (R Madhavan) ఏఐ టెక్నాలజీని ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీపై అవగాహన ఉన్న తాను కూడా ఓ సారి ఏఐ మాయలో పడ్డానని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మాట్లాడుతన్నట్టున్న ఏఐ వీడియో గురించి షేర్ చేసుకున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..?
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఏఐ(Artificial Intelligence) మాయే కనిపిస్తోంది. అయితే దీనిపై అవగాహన చాలా అవసరం. దీని గురించి అంతో కొంత తెలిసిన నేను కూడా దీనిమాయలో పడ్డాను ఓసారి. గతంలో నేను సోషల్ మీడియాలో ఓ వీడియో చూశాను. ఆ వీడియోలో ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ప్రశంసిస్తున్నట్లుగా ఉంది. కోహ్లి అంటే తనకెంత ఇష్టం, అతడి లీడర్ షిప్ క్వాలిటీస్ ను పొగుడుతూ రొనాల్డో మాట్లాడారు.
అనుష్క మెసేజ్ చేసింది
అది నాకెంతో నచ్చి నా అభిమానులతో షేర్ చేయాలనిపించి వారితో షేర్ చేసుకున్నాను. అది కాస్త అనుష్క (Anushka Sharma) వద్దకు చేరినట్లుంది. అయితే అది ఏఐతో చేసిన ఫేక్ వీడియో అని.. రొనాల్డో విరాట్ గురించి మాట్లాడలేదని.. అది రియల్ వీడియో కాదని అనుష్క శర్మ నాకు మెసేజ్ చేసింది. టెక్నాలజీ గురించి అవగాహన ఉన్న నేను కూడా ఏఐ వీడియోను గుర్తించలేకపోయానని బాధగా అనిపించింది. అందుకే నెట్టింట ఏదైనా సందేశాన్ని షేర్ చేయాలంటే అది నిజమా? కాదా? అని చెక్ చేసుకోవాలి.’’ అని మాధవన్ తెలిపారు.
వరుస సినిమాలతో బిజీబిజీ
ఇక మాధవన్ సినిమాల సంగతికి వస్తే.. ‘షైతాన్’తో గతేడాది ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన ‘అదృష్టశాలి’, ‘టెస్ట్’, ‘దే దే ప్యార్ దే 2 (De De Pyaar De 2)’, ‘కేసరి చాప్టర్ 2’, ‘ధురందర్’ చిత్రాల్లో నటిస్తున్నారు. వీటితో పాటు కంగనా రనౌత్ తో కలిసి మరో సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాధవన్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ అభిమానమే తనను ఇంకా సినిమాలు చేసేలా ప్రేరేపిస్తోందని చెప్పారు.






