ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగి ఇప్పడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్న సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించారట. కెరీర్ ప్రారంభంలో అవకాశాలు రాకపోవడం, నాన్న ఇంటి నుంచి వెళ్లిపోమనడంతో మనస్తాపం చెందానని, సూసైడ్ చేసుకోవాలనుకున్నానని ఆయన అన్నారు.
ఓ పాడ్‌కాస్ట్‌లో (Podcost) రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ‘మా నాన్న స్కూల్ టీచర్. చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. నేను ఇంజినీరింగ్ పూర్తిచేసుకున్న తర్వాత వెంటనే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా. ఈ విషయాన్ని మా నాన్నకు చెప్తే ఆయన అసహనం వ్యక్తం చేశారు. నీ ఇష్టానికి నువ్వు వెళ్తున్నావు. సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఏది వచ్చినా అది నీకు సంబంధించిన విషయం. ఒకవేళ ఫెయిలైతే ఇంటికి రావద్దు’ అన్నారు. ఆ మాటలు నామీద ఎఫెక్ట్ చూపాయి.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘మద్రాస్ వెళ్లి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరా. గోల్డ్ మెడల్ సాధించా. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. వేషాలు వచ్చే గ్లామర్‌గా లేనని నాకు తెలుసు. అలాంటి సమయంలో తిరిగి ఇంటికి వెళ్లా. ఇంటికి రావద్దు అన్నాను కదా ఎందుకు వచ్చావు అని నాన్న కోప్పడ్డారు. బాధగా అనిపించి వెంటనే మద్రాస్ వచ్చేశా. సూసైడ్ చేసుకోవాలనుకున్నా’ అన్నారు. అందుకే తన ఆత్మీయులందరినీ ఓసారి చూడాలనుకొని వాళ్ల ఇళ్లకు వెళ్లినట్లు చెప్పారు.
‘చివరిగా నిర్మాత పుండరీ కాక్షయ్య గారి ఆఫీస్‌కు వెళ్లా. అక్కడ మేలుకొపులు సినిమాకు సంబంధించి ఏదో గొడవ జరుగుతోంది. ఆఫీస్ రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆయన.. ఏమీ చెప్పకుండా నన్ను డబ్బింగ్ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఒక సీన్ నాతో డబ్బింగ్ చెప్పించారు. అది ఆయనకు బాగా నచ్చింది. మంచి సమయానికి దొరికావు ప్రసాద్ అన్నారు. రెండో సీన్‌కు చెప్పమనగానే.. భోజనం చేసి మూడు నెలలయ్యింది. భోజనం పెడితే డబ్బింగ్ చెబుతానన్నా. అకాశాలు లేక సూసైడ్ చేసుకోవాలనుకున్నా అని ఆయతో చెప్పా. దానికి ఆయన కోప్పడ్డారు. ఇంటికి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించారు. నాకు ధైర్యం చెప్పారు. అలా డబ్బింగ్ ప్రయాణం మొదలైంది. ఎన్నో చిత్రాలకు డబ్బింగ్ చెప్పా. అలా వచ్చిన డబ్బుతో మద్రాస్‌లో ఇల్లు కట్టా. అక్కడే నాకు దర్శకుడు వంశీతో పరిచయమైంది. అతడి సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా’ అని నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు రాజేంద్రప్రసాద్.