Mana Enadu : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అపాయింట్‌మెంట్ ఇస్తే, తన ఆలోచనని ఆయనతో పంచుంటానని నటుడు సాయాజీ షిండే (Actor Sayaji Shinde) అన్నారు. దేవాలయాల్లో ప్రసాదంతో పాటు, భక్తులకు ఒక మొక్కను ఇస్తే బాగుంటుందని.. తన ఆలోచనను పవన్ తో షేర్ చేసుకుంటానని చెప్పారు. తాను ఇప్పటికే పలు ఆలయాల్లో ఈ పని చేస్తున్నానని చెప్పారు. సుధీర్‌బాబు (Sudheer Babu) హీరోగా నటించిన చిత్రం ‘మా నాన్న సూపర్‌హీరో’ (Maa Nanna Superhero) ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రబృందంతో కలిసి సాయాజీ షిండే ‘బిగ్‌బాస్ సీజన్-8లో పాల్గొన్నారు.
ఖాళీ ప్రదేశం కనబడితే చెట్లు నాటతారు
ఈ సందర్భంగా నటుడు సాయాజీ గురించి సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ఖాళీ ప్రదేశం కనపడితే చెట్లు నాటతారని వ్యాఖ్యాత నాగార్జునతో (Nagarjuna) చెప్పగా.. మొక్కలు నాటడం వెనుక ఉన్న స్టోరీని అడిగారు. దీంతో సాయాజీ షిండే దీని వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ.. తన తల్లి మరణం తర్వాత ఆమె బరువంత విత్తనాలను దేశవ్యాప్తంగా మొక్కలుగా నాటాలని నిర్ణయించానని చెప్పారు. అలా ఆ చెట్లు, పూలు, పండ్ల రూపంలో తన తల్లిని చూసుకుంటున్నానని వివరించారు.
అమ్మ తర్వాత నాకు భూమాతే
‘‘మా అమ్మగారు 97లో కన్ను మూశారు. ఆమె బతికి ఉన్నప్పుడు.. ‘అమ్మా నా దగ్గర ఇంత డబ్బు ఉంది. కానీ, నేను నిన్ను బతికించుకోలేను. నేనేం చేయను’ అని బాధపడ్డాడు. అప్పుడే నాకో ఆలోచన వచ్చింది. మా అమ్మగారి బరువుకు సమానమైన విత్తనాలను తీసుకుని, ఇండియా (India) మొత్తం నాటుతానని ఆమెకు మాటిచ్చాను. నేను నాటిన చెట్లు కొన్నాళ్లకు పెరిగి నీడను ఇస్తాయి. పూలు, పండ్లు ఇస్తాయి. వాటిని చూసినప్పుడల్లా మా అమ్మ గుర్తుకు వస్తుంది. మా అమ్మ తర్వాత నాకు భూమాత కూడా అంతే గుర్తొస్తుంది. అని సాయాజీ షిండే తన స్టోరీని షేర్ చేసుకున్నారు.
ప్రసాదంతో పాటు మొక్క
సాధారణంగా ఆలయాలకు వెళ్లిన వాళ్లకు ప్రసాదాలు పంచి పెడతారు.. ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా ఇస్తే బాగుంటుందని సాయాజీ షిండే తెలిపారు. దాన్ని భక్తులు తీసుకెళ్లి నాటితే అందులో భగవంతుడిని చూసుకోవచ్చని వెల్లడించారు. మహారాష్ట్రలో మూడు ఆలయాల్లో (Temples) తాను ఈ విధానం ప్రారంభించానని.. ఎవరైతే అభిషేకం చేస్తారో వారిలో సుమారు 100, 200 మందికి ప్రసాదంలాగా వీటిని ఇస్తారని చెప్పారు.
పవన్ తో అపాయింట్మెంట్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (AP Deputy CM) అపాయింట్‌మెంట్ దొరికితే ఆయన్ను కలిసి ఈ వివరాలన్నీ చెబుతాను. దేవుడి ప్రసాదంలాగా మొక్కలను అందరికీ పంచాలి. అవి నాటితే పెరిగి చెట్లు అవుతాయి. తర్వాత ఏడు జన్మలకు అవి పెరుగుతూనే ఉంటాయి’’ అని షాయాజీ షిండే చెప్పడంతో ఆయన ఆలోచనను నాగార్జున మెచ్చుకున్నారు. పవన్‌కల్యాణ్‌కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారని, వారు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తారని నాగార్జున అన్నారు.






