సంక్రాంతి సంబురాలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ప్రేక్షకులను అలరించడానికి టాలీవుడ్ చిత్రాలు రెడీ అయ్యాయి. ఈ సంక్రాంతి పండుగకు ముగ్గురు బడా హీరోలు తమ బిగ్ ప్రాజెక్ట్స్ తో సందడి చేసేందుకు వస్తున్నారు. అయితే ఈ పండుగకు వస్తున్న సినిమాల (Sankranti Movies 2025) విషయంలో ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది. అదేంటంటే..? ఆరేళ్ల తర్వాత ముగ్గురు హీరోలు మళ్లీ సంక్రాంతికి వస్తున్నారు. వాళ్లు ఎవరు..? ఆ సినిమాలు ఏంటి..? ఆ సంక్రాంతి విన్నర్ ఎవరు..? ఈ సంక్రాంతికి గెలిచేదెవరు..? ఈ స్టోరీలో చూద్దాం.
ఎన్టీఆర్ గా బాలయ్య
సరిగ్గా ఆరేళ్ల క్రితం అంటే.. 2019లో సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ఆడియెన్స్ ను ఫిదా చేసేందుకు వచ్చారు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తెలుగువారి అభిమాన నటుడు ఎన్టీఆర్ బయోపిక్ ‘NTR: కథానాయకుడు’తో (NTR: Kathanayakudu) ఐదేళ్ల క్రితం థియేటర్లలో సందడి చేశాడు బాలయ్య బాబు (Balakrishna). ఆ సినిమాలో తండ్రి పాత్రలో ఆయన ఒదిగిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. క్రిష్ తెరకెక్కించిన ఈ సినిమాను ప్రేక్షకులు కూడా ఆదరించారు.
ఎన్నో అంచనాలతో వచ్చిన రామ్ చరణ్
ఇక అదే ఏడాది సంక్రాంతి కానుకగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), బోయపాటి శ్రీను కాంబోలో ‘వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama)’ సినిమా వచ్చింది. బ్రదర్స్ సెంటిమెంట్, కుటుంబ నేపథ్యంలో ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. చెర్రీ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్, బోయపాటి టేకింగ్ మాస్ ఆడియెన్స్ ను మెప్పించినా.. ఫలితం మాత్రం పెద్దగా రాలేదు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వానీ నటించిన విషయం తెలిసిందే.
2019 విన్నర్ ఎఫ్2
2019 సంక్రాంతికి నవ్వుల పూలు పూయించాడు విక్టరీ వెంకటేశ్ (Venkatesh). అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ, వరుణ్ తేజ్ (Varun Tej) మల్టీస్టారర్ గా వచ్చిన ‘ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ సూపర్ హిట్ కొట్టింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో అంతేగా.. అంతేగా అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో చెప్పనక్కర్లేదు. ఇక ఆ ఏడాది సంక్రాంతి విన్నర్‌గా ‘ఎఫ్2’ (F2: Fun and Frustration) నిలిచింది. అంతే కాదు.. రూ.100 కోట్లు వసూలుచేసి, రికార్డు క్రియేట్ చేసింది.
2025 విన్నర్ ఎవరు
ఇక ఆరేళ్ల తర్వాత 2025 సంక్రాంతి రేసులోనూ ఈ ముగ్గురు హీరోలే బరిలో నిలిచారు. శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ‘గేమ్ ఛేంజర్ (Game Changer)’ సినిమా జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులోనూ కియారా అడ్వాణీ హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు నిర్మాత. మరోవైపు జనవరి 12వ తేదీన బాలకృష్ణ (Bala Krishna) డాకు మాహారాజ్ రిలీజ్ కు రెడీ అయింది. బాబీ దర్శకత్వంలో వస్తున్నఈ మాస్ యాక్షన్ డ్రామాలో ప్రజ్ఞా జైశ్వాల్, శ్రద్ధాశ్రీనాథ్ కథానాయికలు. నాగవంశీ నిర్మాత. ఇక ఈ పండుగ వేళ విందు పండించడానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాతో జనవరి 14వ తేదీన థియేటర్లోలకి వస్తున్నారు విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది ఈ కాంబో. ఇందులో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ సినిమాకు కూడా దిల్‌రాజు నిర్మాత.






