టీమిండియా టెస్టు కెప్టెన్సీకి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వీడ్కోలు పలికిన తర్వాత, తదుపరి కెప్టెన్ ఎవరనే చర్చ బీసీసీఐ(BCCI)లో జోరుగా సాగుతోంది.కేఎల్ రాహుల్(KL Rahul), శుభ్‌మన్ గిల్(Shubman gill) పేర్లు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్.. కేఎల్ రాహుల్ అయితే బెటర్ అని అభిప్రాయపడ్డారు.
బంగర్ అభిప్రాయం ఇలా ఉంది..
సంజయ్ బంగర్ (former cricketer Sanjay Bangar) అలా అనడానికి కొన్ని కారణాలున్నాయి. రాహుల్ ఇప్పటికే టెస్టుల్లో తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా కఠినమైన పరిస్థితుల్లో, విదేశీ పిచ్‌లపై రాహుల్ కీలకమైన పరుగులు చేశాడు. ఓపెనర్‌గా, మిడిలార్డర్‌లోనూ రాణించగల సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా, రాహుల్‌కు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం కూడా ఉంది.
ఇక రాహుల్, గిల్ టెస్టు గణాంకాలను పరిశీలిస్తే..
కేఎల్ రాహుల్: 58 టెస్టుల్లో 33.58 సగటుతో 3,257 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 199.
శుభ్‌మన్ గిల్ : 32 టెస్టుల్లో 35.05 సగటుతో 1,893 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.అత్యధిక వ్యక్తిగత స్కోరు 128.
అనుభవానికే ఓటేసిన మాజీ క్రికెటర్..
ఈ గణాంకాలను బట్టి చూస్తే, అనుభవం, స్కోరింగ్ పరంగా రాహుల్ కాస్త ముందున్నాడు.టాపార్డర్(Top order)లో చాలా ముఖ్యమైన రన్స్ చేశాడు. విదేశాల్లోనే అతను ఎక్కువ సెంచరీలు చేసినందున ఏ పరిస్థితుల్లోనైనా అతని సామర్థ్యంపై అనుమానాలు అక్కర్లేదు.రాహుల్ అంత పెద్దవాడు కూడా కాదు. అతని వయసు ఇప్పుడు 31 లేదా 32 ఏళ్లు ఉంటాయి కావొచ్చు. రెండేళ్ల వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ సర్కిల్‌ను పూర్తిగా ఆడగలడు అని ఓ జాతీయ మీడియాకు బంగర్ తెలిపారు.
అయితే, గిల్ కూడా నిలకడగా రాణిస్తూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే గిల్ కూడా మంచి నాయకుడు కాగలడు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవం.. వివిధ పరిస్థితుల్లో రాణించిన రికార్డును పరిగణలోకి తీసుకుంటే రాహుల్ కెప్టెన్సీకి మరింత మెరుగైన ఎంపిక అని సంజయ్ బంగర్ అభిప్రాయ పడి ఉండవచ్చు.








