
ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్నిప్రమాదం జరగడానికి తనకి ఇంకా కారణం తెలియదు కానీ ఘటన జరగడం దురదృష్టకరమని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో కలిసి గురువారం ఖమ్మం పత్తి మార్కెట్లో ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అగ్నిప్రమాదంలో జరిగిన నష్టాన్ని తక్షణమే అంచనా వేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
వంద కొట్లతో అభివృద్ధి చేస్తా:
మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రూ.100కోట్ల నిధులతో మార్కెట్ యార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మార్కెట్ యార్డ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. మార్కెట్ పరిసరా ప్రాంతాల్లో రహదారులు విస్తరించేందుకు ప్రతిపాదనలు చేయాలని అధికారులకు సూచించారు.
పదిరోజుల్లో కొత్త మార్కెట్:
పదిరోజుల్లోనే మద్దులపల్లి మార్కెట్ ను ప్రారంభించబోతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటికే జరుగుతున్న మార్కెట్ నిర్మాణ పనులను స్వయంగా జిల్లా కలెక్టర్ పర్యావేక్షణ చేస్తున్నారని పేర్కొన్నారు. అప్పటివరకు రైతులు సంయమనం పాటించాలని తుమ్మల కోరారు. గతంలో మాదిరిగానే మార్కెట్ యార్డులో అగ్నిమాపక యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.