Mana Enadu : హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట (Sandhya Theatre Case) కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విచారణ ముగిసింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అధికారులు దాదాపు మూడున్నర గంటలపాటు ఆయణ్ను విచారించారు. ఈ కేసు విషయంలో సోమవారం రోజున పోలీసులు అల్లు అర్జున్ (Allu Arjun Inquiry)కు నోటీసులు ఇవ్వగా ఇవాళ.. తన తండ్రి, నిర్మాత అల్లు అరవింద్‌తో కలిసి ఉదయం 11 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యాడు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు.
20కి పైగా ప్రశ్నల వర్షం
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన.. తదనంతర పరిణామాలపై ఏసీపీ రమేశ్, ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ అల్లు అర్జున్‌ను ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల 10 నిమిషాల వీడియో (Sandhya Theatre Stampede Video)ను చూపించి ఆధారంగా ప్రశ్నించినట్టు తెలిసింది. దాదాపు మూడున్నర గంటలపాటు విచారణ సాగింది. దాదాపు 20కిపైగా ప్రశ్నలు అడగగా.. కొన్ని ప్రశ్నలకు బన్నీ సమాధానాలు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం.
బన్నీ వాంగ్మూలం రికార్డు
తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం థియేటర్‌లో ఉన్నప్పుడు మీకు తెలియదా..? మీడియా ముందు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు..? రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా..? పర్మిషన్ లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు..? వంటి ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఇక విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. ఇక అల్లు అర్జున్ విచారణ ముగియడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఠాణా వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు.






