ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాసేపట్లో నాంపల్లి కోర్టుకు రానున్నాడు. న్యాయస్థానంలో బెయిల్ పూచీకత్తు సమర్పించనున్నాడు. మరోవైపు నాంపల్లి కోర్టు జడ్జి ముందు పత్రాలు అందించనున్నాడు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో (Sandhya Theatre Case) అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ.. రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
పోలీసులను బెదిరించొద్దు
సంధ్య థియేటర్ కేసులో శుక్రవారం రోజున అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసిన నాంపల్లి కోర్టు (Nampally Court) .. ప్రతి ఆదివారం ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 01.00 గంటల వరకు రెండు నెలల పాటు (ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు) చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని పేర్కొంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎటువంటి బెదిరింపులకు పాల్పడవద్దని సూచించింది. ఈ కేసును ప్రభావితం చేసేలా ఎలాంటి చర్యలకు పాల్పడొద్దని, సాక్షులను బెదిరించే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది.
ఇదీ జరిగింది
డిసెంబరు 4వ తేదీన పుష్ప-2 బెనిఫిట్ షో (Pushpa 2 Benefit Show) సందర్భంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు వెళ్లగా ఆయణ్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. పరిస్థితులు అదుపుతప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో అక్కడ చోటుచేసుకున్న తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించింది. ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలు కాగా ప్రస్తుతం ప్రాణాల కోసం ఆస్పత్రిలో పోరాడుతున్నాడు. ఇదంతా అల్లు అర్జున్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆరోపిస్తూ ఈ కేసులో ఆయణ్ను ఏ11గా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక రేవతి కుటుంబ సభ్యులకు ఇప్పటికే అల్లు అర్జున్ కోటి రూపాయల ఆర్థిక సాయం చేశాడు. మరోవైపు పుష్ప-2 చిత్ర నిర్మాతలు కూడా సాయమందించిన విషయం తెలిసిందే.






