ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈరోజు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు ఆయన ఆస్పత్రికి వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పుష్ప-2 బెనిఫిట్ షో సమయంలో డిసెంబరు 4వ తేదీన సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో (Sandhya Theatre Case) రేవతి అనే మహిళ మరణించగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ ను పరామర్శించేందుకు బన్నీ ఈరోజు హాస్పిటల్ కు వెళ్తున్నట్లు తెలిసింది.
మాకు చెప్పే వెళ్లాలి
అయితే కిమ్స్ కు వెళ్లేటప్పుడు తమకు సమాచారం ఇవ్వాలని.. తమ సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని ఇప్పటికే రాంగోపాల్ పేట్ పోలీసులు (Police Notices To Allu Arjun) అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు బన్నీ రాక సందర్భంగా ఆస్పత్రి వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు, ఆస్పత్రి వర్గాలు చర్యలు తీసుకున్నారు. శ్రీతేజ్ ను పరామర్శించిన తర్వాత బన్నీ మీడియాతో మాట్లాడ్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.







