సంక్రాంతి పండుగ (Sankranti) సందర్భంగా హైదరాబాద్ నగరవాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. వారాంతం కావడంతో కుటుంబంతో కలిసి పల్లెకు బయల్దేరుతున్నారు. ఈ నేపథ్యంలో నగర శివార్లు, టోల్ ప్లాజాలు, జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంటోంది. ఇక శని, ఆదివారాల్లో ఈ రద్దీ మరింత పెరగనుంది. ఈ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే వాహనదారుల కోసం పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. ఈ రూట్లు ఫాలో అయ్యారంటే రద్దీలో చిక్కుకోకుండా హాయిగా మీ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
రూటు మార్చితే ట్రాఫిక్ బాధ ఉండదు
హైదరాబాద్ నుంచి గుంటూరు (Gunturu), మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే ప్రయాణికులు నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై నుంచి వెళ్తే.. విజయవాడ హైవేపై వస్తే హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చౌటుప్పల్, పంతంగి టోల్‌ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుని ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే కాస్త దూరం పెరిగినా.. హైదరాబాద్-నాగార్జునసాగర్ హైవే (Hyderabad Nagarjuna Sagar Highway) మీదుగా వెళ్తే సాఫీగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రయాణికులు ఓఆర్‌ఆర్‌పైకి వెళ్లి బొంగులూరు గేట్ వద్ద ఎగ్జిట్ తీసుకుని నాగార్జునసాగర్ హైవేలోకి వెళ్లాలి.
విజయవాడ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి
ఇక హైదరాబాద్ నుంచి ఏలూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం వెళ్లే వాహనాలను విజయవాడ సమీపంలో నిర్మించిన పశ్చిమ బైపాస్ (Vijayawada Bypass) మీదుగా మళ్లిస్తున్నారు. ఇప్పటిదాకా వాహనాలు విజయవాడ నగరం మీదుగా వెళ్తున్నందున, ట్రాఫిక్ రద్దీ వేళల్లో ఒక్కోసారి 2-3 గంటల సమయం పడుతుంది. ఇకపై సులువుగా గమ్యస్థానాలకు చేరొచ్చు.
ఈ రూట్లలో వెళ్లండి గురూ
ఖమ్మం, విజయవాడ (Vijayawada) వైపు వెళ్లే ప్రయాణికులు భువనగిరి, రామన్నపేటల మీదుగా చిట్యాలకు వెళ్లాలి. నార్కట్‌పల్లి దాటితే వీరు ట్రాఫిక్ బాధ తప్పించుకున్నట్లే. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌గేట్ దాటిన తర్వాత కొన్ని వాహనాలు ఉమ్మడి ఖమ్మం జిల్లా వైపు, మరికొన్ని విజయవాడ వైపు వెళ్తాయి కాబట్టి మిగతా రెండు టోల్‌ప్లాజాల వద్ద పెద్దగా ట్రాఫిక్ జామ్ ఏర్పడదు. మరోవైపు హైదరాబాద్ నుంచి భువనగిరి వైపు వెళ్లాలనుకునే వారు ఓఆర్‌ఆర్‌పైకి వెళ్లి ఘట్‌కేసర్‌లో ఎగ్జిట్ తీసుకుని వరంగల్ హైవేలోకి వెళ్తే ప్రయాణం సాఫీగా సాగుతుంది.







