ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) గురించి తెలియని వారుండరు. ఆయన గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి ఏ వార్త వచ్చినా అది సెన్సేషనే. ఇటీవల ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) వివాహం బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. దేశవిదేశాల నుంచి ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. దాదాపు ఓ రెండు మూడు నెలల పాటు ఎక్కడ చూసినా అనంత్-రాధిక వివాహం గురించే చర్చంతా.
గుజరాత్ టు ద్వారక యాత్ర
ఇక తాజాగా అనంత్ అంబానీ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన తన 30వ (ఏప్రిల్ 10వ తేదీ) పుట్టినరోజును ద్వారకలో జరుపుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారక (Jamnagar to Dwarka) వరకూ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున అనంత్ తన పాదయాత్రను మొదలుపెట్టారు. మొత్తం 140 కిలోమీటర్ల ఈ ప్రయాణం ప్రస్తుతం 5వ రోజు కొనసాగుతోంది. ద్వారకా చేరుకోవడానికి మరో నాలుగు రోజులు పట్టే అవకాశం ఉందని సమాచారం.
రాత్రిపూట పాదయాత్ర
ఇక అనంత్ అంబానీ Z+ భద్రత, స్థానిక పోలీసు రక్షణ మధ్య పాదయాత్ర సాగిస్తున్నారు. ట్రాఫిక్‌ను నివారించడానికి, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాత్రిపూట తన యాత్ర చేస్తున్నారు. రోజు 10 నుంచి 12 కిలోమీటర్ల మేర నడుస్తున్నట్లు సమాచారం. తాను ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా ద్వారకాధీశుడిని స్మరించుకుంటానని అనంత్ అన్నారు. అలా చేస్తే ఎలాంటి అవరోధాలూ లేకుండా తలపెట్టిన కార్యం విజయవంతంగా పూర్తవుతుందని తన నమ్మకం అని తెలిపారు.






