Mana Enadu : ఏపీ అసెంబ్లీ సమావేశాల (AP Assembly Sessions)కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశ పెట్టనుంది. కనీసం పది రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం.. బడ్జెట్ (AP Budget 2024) తో పాటు ఇతర బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. ఇక ఇప్పటివరకూ ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయార్జాన, బడ్జెట్ స్వరూపం, ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే అంశాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు (AP CM Chandrababu Naidu) ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రవేశపెట్టిన శ్వేతపత్రం ఆధారంగా వీటిని సమీక్షించినట్లు తెలిసింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) రాష్ట్ర రెవెన్యూ రూ.1,73,766 కోట్లు రాగా.. ప్రస్తుత ఏడాదిలో రూ.2 లక్షల కోట్ల ఆదాయార్జన సాధ్యాసాధ్యలపై సీఎం దృష్టి సారించారు.
కొత్త విధానాల వల్ల, తీసుకోబోయే నిర్ణయాల వల్ల రాబడిపై ప్రభావం ఎలా ఉండబోతోంది..? వచ్చే 5 నెలల్లో రాష్ట్ర అవసరాలేంటి? సంక్షేమ పథకాల తాజా పరిస్థితులు, ప్రభుత్వ ప్రాధాన్యాలు, సంబంధిత కార్యక్రమాలు పూర్తి చేసేందుకు ఉన్న లోటును ఎలా పూడ్చుకోవాలి?.. ఇలాంటి అంశాలపై ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. మరోవైపు పెండింగ్ బిల్లుల తాజా పరిస్థితులపైనా దృష్టి సారించనున్నట్లు తెలిసింది.






