
ఏపీ(Andhra Pradesh)లో కూటమి సర్కార్ మరో విప్లవాత్మక కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సర్టిఫికెట్ల జారీకి దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా అందజేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్(WhatsApp Governance)కు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ప్రజలకు మొదటి దశలో 161 రకాల పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి. రెండో దశలో 300 పైగా పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో రెవెన్యూ, దేవాదాయ శాఖ, CMRF.. ఇలా మొత్తంగా “మన మిత్ర” ద్వారా 161 రకాల సేవలను పౌరులకు అందుబాటులో ఉంటాయని మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
యువగళం పాదయాత్రలోనే ఈ ఆలోచన
పరిపాలన సంస్కరణల్లో ఇది ఒక చారిత్రాత్మక రోజు. “మన మిత్ర” పేరుతో దేశంలోనే మొదటి సారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభిస్తున్నాం. గతంలో చంద్రబాబు (CM Chandrababu) ఈ గవర్నన్స్(E-Governance)తో ముందుకు వస్తే, ఈ సారి వాట్సాప్ గవర్నెన్స్ తో ప్రజలకు మరింత చేరువగా సేవలు అందిస్తున్నాం అన్నారు. యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra)లోనే వాట్సాప్ గవర్నెన్స్ ఆలోచన వచ్చిందన్నారు. బటన్ నొక్కితే భోజనం, సినిమా వచ్చినపుడు.. పాలన ఎందుకు రాకూడదు? ప్రజల చేతిలో ప్రభుత్వం ఉండాలనేది మా ఉద్దేశం అన్నారు. కాగా దీనికోసం ఏపీ ప్రభుత్వం అధికారిక వాట్సప్ నంబర్ 95523 00009ను కేటాయించింది. దీని ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందించనుంది.