ఇటీవల భారీ వర్షాలు(heavy rains) తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. వరుణుడి దెబ్బకు AP, తెలంగాణ(Telangana)లోని ప్రాజెక్టులననీ జలకళను సంతరించుకున్నాయి. కృష్ణా, గోదావరి నదులతోపాటు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే రెండు రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ రానున్నాడు. ఈ నెల 25న బంగాళాఖాతం(Bay of Bengal)లో కొత్తగా ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు
భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం, వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆగస్టు 25 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం కారణంగా ఆగస్టు 25, 26, 27 తేదీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దు..
ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో, తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. అల్పపీడనం కారణంగా సముద్రంలో వాతావరణం అనుకూలంగా ఉండవచ్చు. అందువల్ల, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.






