కరోనా (Corona).. ఈ పేరు వింటే చాలు అందరికి గుండెలో దడ మొదలవుతుంది. ఈ మహమ్మారి గత నాలుగేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించింది. చాలా దేశాల ఆర్థిక స్థితిగతులను తలకిందులు చేసింది. చాలా ప్రాంతాలు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి. ఎన్నో లక్షల మంది ప్రాణాలను హరించిన ఈ మహమ్మారి ఎంతో మందికి తమ ఆత్మీయులను దూరం చేసింది. ఇక ఈ వైరస్ కు మూల కేంద్రమైన చైనాలో ఇప్పుడు మరో మహమ్మారి కలకలం రేపుతోంది.
చైనాలో HMPV కలకలం
హ్యూమన్ మెటానిమో వైరస్ (HMPV) చైనాలో ఇప్పుడు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మహమ్మారి బారినపడి అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు వార్తలొస్తున్నాయి. హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 (Covid 19) వైరస్‌లు కూడా చైనాలో భారీగా వ్యాప్తి చెందుతున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతోంది.
కొవిడ్ లక్షణాలతో HMPV వైరస్
అయితే ఈ వైరస్ సోకిన వారిలో కొవిడ్ తరహాల లక్షణాలే (HMVP Symptoms) కనిపిస్తున్నట్లు యూజర్లు తమ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ చేస్తున్నారు. మరోవైపు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ విడుదల చేసిన నివేదిక కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. గుర్తు తెలియని నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందని ఆ నివేదిక పేర్కొంది.








