ఎటు చూసినా కాంక్రీట్ జంగిల్.. రద్దీగా ఉండే రహదారులు.. కాలుష్యంతో నిండిపోయిన నగరాలు.. హడావుడి జీవితం.. ఒత్తిడితో కూడిన పని.. సిటీ లైఫ్ లో ఉండే ప్రతి ఒక్కరి జీవితం ఇలాగే ఉంటుంది. దీనికి రాజకీయ నేతలు కూడా అతీతులు కారు. అందుకే సేదతీరేందుకు కాస్త సమయం దొరికినా చాలా మంది ప్రకృతి ఒడిలో గడపేందుకు ఇష్టపడుతుంటారు. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అతీతులు కారు. ఆయనకు ప్రకృతి అంటే ఏంతో ప్రేమ అన్న విషయం తెలిసిందే.
ప్రకృతిలో పవర్ స్టార్
సమయం దొరికితే ఆయన ఫాం హౌజుకు వెళ్లి ఆవుల మధ్య సేద తీరుతూ ఉంటారు. అయితే డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టాక విరామం దొరకడం లేదు ఆయనకు. ప్రజాసేవ నుంచి కాస్త గ్యాప్ దొరికితే ఆయన ముఖానికి రంగేసి సినిమా షూటింగుల్లో బిజీబిజీ అయిపోతున్నారు. ఇక ఆయనకు ప్రకృతి ఒడిలో సేదతీరేంత సమయం ఎక్కడ ఉంటుంది. అందుకే ప్రజాసేవలో భాగంగా ప్రకృతి రమణీయమైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాత్రం అక్కడ నేచర్ తో మమేకమైపోతారు.

నేచర్ లో డిప్యూటీ సీఎం వాకింగ్
తాజాగా ఆయన మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన కాన్వాయ్ వెళ్తుండగా.. పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. మొదట సాలూరు నియోజకవర్గంలోని బాగుజోల గ్రామంలో పర్యటించిన ఆయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఇక మక్కువ మండలం కవిరిపల్లి గ్రామంలో పర్యటించిన పవన్.. కాన్వాయ్ వదిలి కాలినడకన వెళ్లారు.

ట్రెండింగ్ లో ప్రకృతి ప్రేమికుడు
డిప్యూటీ సీఎం కాలినడకన వెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రకృతిలో పవర్ స్టార్ అంటూ నెటిజన్లు బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఎంతైనా మా బాస్ కు నేచర్ అంటే భలే ఇష్టం అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు వీడియోలో.. చీపురు వలస సమీపంలోని వెంగళరాయసాగర్ వ్యూ పాయింట్ వద్ద ఆగి ప్రకృతి అందాలను తిలకించడం చూడొచ్చు. జలపాతాలను స్వయంగా మొబైల్ లో రికార్డు చేయడం కనిపిస్తోంది.






