
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీ విధానాన్ని మరింత తీర్చిదిద్దే దిశగా కొత్త విధానాన్ని ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. రేషన్ డిపోల వద్ద ఇప్పుడు ప్రత్యేకమైన QR కోడ్ పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కోడ్‌ను స్కాన్ చేసి ప్రజలు తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు నేరుగా తెలియజేసే వెబ్ ఫారమ్‌కు వెళ్లవచ్చు.
ఈ వెబ్ ఫారమ్‌లో రేషన్ కార్డుదారులు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు “అవును/కాదు” అనే సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగా:
ఈ నెల రేషన్ తీసుకున్నారా?
సరుకుల నాణ్యతపై సంతృప్తిగా ఉన్నారా?
సరైన తూకంతో సరఫరా చేశారు?
డీలర్ మర్యాదగా వ్యవహరించారా?
అధిక ధరలు వసూలు చేశారా?
ఇలాంటి ప్రశ్నలకు ప్రజలు ఇచ్చే సమాధానాలు నేరుగా ఉన్నతాధికారులకు చేరతాయి. ఫలితంగా, అవసరమైనచోట్ల తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రభుత్వ పథకాలు నిజంగా లబ్ధిదారుల వరకు చేరుతున్నాయో లేదో తెలుసుకునేందుకు ఇది సహకరిస్తుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రజల భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వ సేవలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో ఈ వ్యవస్థను అమలు చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దీనిద్వారా బాధ్యతాయుత పాలనకు మరింత దారితీస్తుంది.
అంతేకాదు, నేటి నుంచి 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఇంటికే రేషన్ సరఫరా చేయడం ప్రారంభించారు. జూలై నెల రేషన్‌ను ముందస్తుగా జూన్ 26 నుంచే పంపిణీ చేస్తున్నారు.