Mana Enadu : ఏపీ మహిళలకు శుభవార్త. ఉచిత బస్సు ప్రయాణం (Free Bus For Women)పై కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ పథకం అమలుపై తాజాగా రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, డీజీపీ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పథకం ఎప్పటి నుంచి ప్రారంభించాలనేదానిపై చర్చించినట్లు సమాచారం.
ఏం చర్యలు తీసుకున్నారు?
ఈ నేపథ్యంలో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఉచిత బస్సు ప్రయాణం అమలుపై శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని మంత్రి, అధికారులను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఈ పథకం అమల్లో ఉన్న కర్ణాటక, దిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో సందర్శించి సమగ్ర నివేదిక రూపొందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఉగాది నాటికి అమలు
ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని అధికారులు చంద్రబాబుకు తెలిపారు. పర్యటనలు పూర్తయ్యాక సమగ్ర నివేదిక సమర్పిస్తామని చెప్పినట్లు తెలిసింది. ఉగాది (Ugadi Festival 2025) నాటికి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకు వచ్చేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
హామీ అమలుపై కసరత్తు
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికే మహాలక్ష్మి పథకం (Maha Lakshmi Scheme) పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకానికి రాష్ట్రంలో వస్తున్న ఆదరణ చూసి ఏపీ ఎన్నికల సమయంలో కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అంతా అనుకున్నట్లుగానే ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుపై ఇప్పుడు కసరత్తు చేస్తోంది.








