Mana Enadu : టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ (ఆర్జీవీ) (Ram Gopal Varma) గురించి తెలియని వారుండరు. ఆయన తన సినిమాలతోనే కాకుండా తన బోల్డ్ కామెంట్స్, పోస్టులతో వివాదాస్పదమవుతూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నేతలపై తన అభిప్రాయాలు చెబుతూ వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా ఇలాంటి వ్యవహారంలోనే ఆయన పోలీసుల నోటీసులు అందుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆర్జీవీకి పోలీసుల సమన్లు
ఏపీ పోలీసులు (AP Police) దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు.. జూబ్లీహిల్స్‌లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లి ఈ సమన్లు అందజేశారు. ఎస్సై శివరామయ్య ఆధ్వర్యంలోని అధికారుల బృందం నోటీసులు ఇచ్చింది. ఎన్నికలకు ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ సమయంలో.. నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి (CM Chandrababu Naidu)పై ఆర్జీవీ అనుచిత పోస్టులు పెట్టడం వివాదాస్పదమైంది.
విచారణకు హాజరవ్వాలి
చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్‌లో పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ కార్యదర్శి ఎం. రామలింగం మద్దిపాడు స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే విచారణకు హాజరు కావాలంటూ తాజాగా పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు.
వర్మపై మరో ఫిర్యాదు
చంద్రబాబు, పవన్‌కల్యాణ్, లోకేశ్ (Nara Lokesh) ఫొటోలను రామ్‌గోపాల్ వర్మ గతంలో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, అసభ్యకర పోస్టులు పెట్టారని తుళ్లూరులోనూ ఆర్జీవీపై ఓ కేసు నమోదైంది. రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసి.. వర్మపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.






