చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను (India vs Pakistan) చిత్తు చేసిన డిఫెండింగ్ ఛాంప్ భారత్.. ఐదోసారి జూనియర్ హాకీ ఆసియా కప్‌ను (Asia Cup) సొంతం చేసుకొంది. డ్రాగ్‌ఫ్లికర్ అరైజీత్ హుండల్ (Araijeet Singh Hundal) 4 గోల్స్‌తో చెలరేగడంతో.. బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ 5-3తో పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. 2004, 2008, 2015, 2023ల్లో టైటిళ్లు నెగ్గిన భారత జట్టు.. ఈసారి ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్‌ను నిలబెట్టుకుంది.
అరైజీత్ (4వ, 18వ, 47వ, 54వ నిమిషం) 4 గోల్స్ చేయగా.. దిల్‌రాజ్ సింగ్ (19వ) ఒక గోల్ సాధించాడు. పాక్ తరఫున సూఫియాన్ ఖాన్ (30వ, 39వ), హానన్ షాహిద్ (3వ) గోల్స్ చేశారు. ఆట మొదలైన మూడో నిమిషంలోనే షాహిద్ ఫీల్డ్ గోల్‌తో భారత్‌కు షాకిచ్చాడు. అయితే, నిమిషం కూడా గడవకుండానే పెనాల్టీ కార్నర్‌ను అరైజీత్ గోల్‌గా మలిచి 1-1తో సమం చేశాడు.
సెకండ్ క్వార్టర్‌లో దుమ్మురేపిన భారత్
రెండో క్వార్టర్‌లో భారత్ (India) మరింత దూకుడుగా ఆడింది. అర్జిత్ మరో గోల్ చేయడంతో భారత్ 2-1తో పైచేయి సాధించింది. ఆ వెంటనే దిల్‌రాజ్ సింగ్ అద్భుత నైపుణ్యంతో ఫీల్డ్ గోల్‌ను అందించాడు. అయితే, క్వార్టర్ మరో 11 సెకన్లలో ముగుస్తుందనగా సూఫియాన్ పీసీని గోల్‌గా మలచడంతో పాక్ 2-3తో పోటీలో నిలిచింది. ఇక, మూడో క్వార్టర్ ఆరంభమైన తొలి నిమిషంలోనే సూఫియాన్ మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌లోకి పంపి 3-3తో సమం చేశాడు. కానీ, చివరి క్వార్టర్‌లో అరైజీత్ డబుల్ ధమాకాతో భారత్‌ను విజేతగా నిలిపాడు. క్రాస్‌ను అందుకొన్న అర్జిత్ గోల్‌లోకి పంపడంతో భారత్ 4-3తో మరోసారి పైచేయి సాధించింది. ఆ తర్వాత లభించిన మరో పెనాల్టీ కార్నర్‌ను కూడా అరైజీత్ గోల్ పోస్ట్‌లోకి పంపి భారత్‌కు టైటిల్ అందించాడు.
‘టీమ్ ఇండియా పురుషుల జూనియర్ ఆసియా కప్ 2024 ట్రోఫీని పాకిస్థాన్‌పై 5-3తో అద్భుత విజయంతో కైవసం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్లు తమ ఆధిపత్యాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వారు ఆసియాలో ఎందుకు రాజ్యమేలుతున్నారో మరోసారి రుజువు చేశారు.’ అని హాకీ ఇండియా ఎక్స్‌లో పేర్కొంది.
Congratulate Indian Hockey Team on winning Men's Junior Asia Cup 2024 by defeating Pakistan 5-3. Indian boys have won the title for the record fifth time. May the team continue its winning streak and make the country proud. Wish the team all the best for future.… pic.twitter.com/P2GvfKQwD6
— Naveen Patnaik (@Naveen_Odisha) December 5, 2024