Mana Enadu : ‘ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు’ అన్నారు పెద్దలు. ఇప్పుడు పెళ్లిళ్లు చేయడం కాస్త సులువు అవుతోంది కానీ ఇల్లు కట్టుకోవడం మాత్రం కష్టంగా మారింది. భూముల ధరలు భారీగా పెరగడం, ఇక ఇల్లు కట్టేందుకు అవసరమయ్యే సిమెంటు, ఇసుక, ఇతర సామగ్రి ధరలు విపరీతంగా పెరగడంతో ఈ కాలంలో ఇల్లు కట్టడం సామాన్యుడికి పెను భారంగా మారింది. ఇక హైదరాబాద్(Hyderabad Real Estate) లో అయితే ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో నివాసాలు కొనడం చాలా మందికి ఆర్థికంగా భారంగా మారింది.
అందరి చూపు బాలానగర్ వైపు
అందుకే ఇప్పుడు నగరంలో ఇల్లు కొనాలనుకునేవారు శివార్ల వైపు చూస్తున్నారు. సిటీ ఔట్ స్కట్స్ లో బడ్జెట్ ధరల్లో దొరికే ప్రదేశాల్లో నివాసాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే శివార్లు అనడం పేరుకు మాత్రమే ఎందుకంటే ఇప్పుడు ఓఆర్‌ఆర్(ORR) వరకు నివాసాలకు కేంద్రంగా మారాయి. అయితే ఆఫీసులకు ఈ ప్రదేశాలు చాలా దూరంగా ఉండటంతో కొందరు మాత్రం శివార్లలో ఇండ్లు కొనేందుకు తటపటాయిస్తున్నారు. సిటీలోనే తమ బడ్జెట్ లో ఎక్కడ ఇండ్లు దొరుకుతాయా అని తెగ వెతుకుతున్నారు. అలాంటి వారికి బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తోంది ఇప్పుడు బాలానగర్(Balanagar) ప్రాంతం.
నివాసాలకు అనుకూలంగా
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతం నగరవాసులకు సుపరిచతమే. నైపర్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC), సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ వంటి కేంద్ర సంస్థలు ఇక్కడున్నాయి.అయితే ఇది పారిశ్రామిక ప్రాంతంగా ఉండటంతో నివాసాలు పెద్దగా ఏర్పాటు కాలేదు. అయితే బాలానగర్ పేరుతో మెట్రో స్టేషన్ (Balanagar Metro Station) వచ్చాక ఈ ప్రాంతం నివాసాలకు అనుకూలంగా మారింది.
గేటెడ్ కమ్యూనిటీలపై ఫోకస్
ప్రశాంతంగా నివాసం ఉండేందుకు చుట్టుపక్కల IDPL భూములు ఉండటం.. పేరున్న పాఠశాలలు, ఆసుపత్రులు చుట్టుపక్కల ఉండటం.. సమీపంలోని కూకట్‌పల్లి వై జంక్షన్‌లో మెట్రో స్టేషన్‌తో అన్ని ప్రాంతాలకు రవాణా సదుపాయం ఉండటంతో ఈ ప్రాంతం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కూకట్‌పల్లి వై-జంక్షన్ (Kukatpally Y Junction) మొదలు బాలానగర్ నర్సాపూర్ రోడ్డు వరకు గేటెడ్ కమ్యూనిటీలు నిర్మాణంలో ఉన్నాయి.
బాలానగర్ లో ఇల్లు కొంటున్నారా?
కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన వస్తోందని నిర్మాణ సంస్థలు అంటున్నాయి. ఐటీ ఉద్యోగులతో పాటు చుట్టుపక్కల ఉన్న MSME సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారస్థులు ఇక్కడి భవనాలు కొనుగోలు చేస్తున్నారని చెబుతున్నారు. మరి మీరూ బాలానగర్ లో ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా.. అయితే కొనేముందు ఒకసారి ఈ విషయాలు పరిశీలించుకోండి.
ఇల్లు కొనుగోలు చేసే ముందు ఇవి చూస్కోండి
- ఇల్లు కొనుగోలు చేసే ముందు అన్ని అనుమతులు ఉన్నాయో లేవో సరిచూసుకోండి.
- సిటీలో అయితే GHMC, శివార్లలో HMDA అనుమతులు జారీ చేస్తుంది.
- రెరా రిజిస్ట్రేషన్ జరిగిందా?.. RERA నెంబరు వచ్చిందో లేదో చెక్ చేస్కోండి.
- చెరువుల సమీపంలో ప్రాజెక్ట్‌లైతే ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో లేదని నిర్ధారించుకున్నాకే కొనుగోలు చేయండి.
- నిర్మాణ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా సందర్శించిన తర్వాతే కొనుగోలు చేయాలి.






