
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన ఐదో టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఆసీస్ 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోర్ 141/6తో టీమ్ ఇండియా మూడో రోజు ప్రారంభించగా వరుసగా జడేజా(13), సుందర్(12), సిరాజ్(4), బుమ్రా(0) వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ 39.5 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. పంత్ మినహా భారత బ్యాటర్లంతా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్ 4 రన్స్ ఆధిక్యం కలుపుకొని ఆస్ట్రేలియాకు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్‌ను ఆసీస్ కేవలం 27 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కంగారూ బ్యాటర్లలో కోన్ట్సాస్ 22, ఖవాజా 41, హెడ్ 34, వెబ్ స్టార్ 39 రన్స్ చేసి ఆసీస్ విజయంలో కీలకంగా వ్యవహరించారు. ఈ మ్యాచులో 10 వికెట్లతో రాణించిన బోలాండ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్ ఆసాంతం రాణించిన భారత స్పీడ్ గన్ బుమ్రా (32 వికెట్లు)కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు దక్కింది.
🚨 THE WINNING MOMENT OF AUSTRALIA 🚨
– Pat Cummins & his team won the Border Gavaskar Trophy after 10 Years. pic.twitter.com/4WJBTcQrCq
— Johns. (@CricCrazyJohns) January 5, 2025
అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో భారత ప్లేయర్ రిషభ్ పంత్(Pant) 61 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో జైస్వాల్ 22, రాహుల్ 13, గిల్ 13, జడేజా 13, సుందర్ 12 పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్ 6 వికెట్లు తీసి భారత ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చాడు. కమిన్స్ 3 వికెట్లు, వెబ్‌స్టర్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 185 రన్స్ చేయగా.. ఆసీసై 181 పరుగులకు ఆలౌటైంది.
అదే దెబ్బతీసింది..
కాగా ఫామ్ కారణంగా ఈ మ్యాచులో రోహిత్ ఆడకపోవడం, గాయం కారణంగా బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు రాకపోవడం టీమ్ఇండియాను దెబ్బ తీసింది. ఇదిలా ఉండగా ఈ ఓటమితో భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ రేసు నుంచి వైదొలిగినట్లైంది. దీంతో ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది. కాగా కోచ్‌గా గౌతమ్ గంభీర్ వచ్చిన తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలపై టెస్టు సిరీస్‌లు కోల్పోగా.. శ్రీలంకపై వన్డే సిరీస్‌ను కోల్పోయింది.