భార్య వేధింపులు తాళలేక బెంగళూరు టెకీ అతుల్ సుభాశ్ ఆత్మహత్య(Atul Subhash case) చేసుకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో అతడి భార్యను పోలీసులు అరెస్టు చేసింది. ఇక తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన మనవడిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ అతుల్ తల్లి సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించారు. మనవడి జాడ గుర్తించి తమకు అప్పగించాలని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, కర్ణాటక ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు.. ఫరిదాబాద్‌లోని బోర్డింగ్ స్కూల్‌లో తన కుమారుడు చదువుతున్నాడని అతుల్ భార్య పోలీసులు తెలిపినట్లు సమాచారం. ఆ బాలుడు తన సమీప బంధువు సుశీల్ సింఘానియా కస్టడీలో ఉన్నాడని చెప్పినట్లు తెలిసింది. అయితే బాబు జాడ గురించి తనకు తెలియదని సుశీల్ సింఘానియా పోలీసులకు చెప్పడం గమనార్హం.
భార్య వేధింపులు తట్టుకోలేక అతుల్ సుభాష్ (Atul Subhash) 40 పేజీల లేఖ రాసి బెంగళూరులో బలవన్మరణానికి (Bengaluru Techie Suicide) పాల్పడ్డ విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆయన ఒక కంపెనీలో ఐటీ డైరెక్టర్‌గా పని చేస్తూ మారతహళ్లిలోని మంజునాథ లేఅవుట్లో ఉంటున్న ఆయన భార్యతో తాను అనుభవిస్తున్న మానసిక క్షోభకు సంబంధించి రాసిన లేఖను ఇ-మెయిల్ ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, తన కార్యాలయం అధికారులు, సిబ్బంది, కుటుంబసభ్యులకు పంపించారు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అతుల్ భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి, సోదరుడిని అరెస్టు చేశారు.







