
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (rohit sharma), విరాట్ కోహ్లీ (virat kohli) టెస్టుల్లో తీవ్రంగా విఫలమవుతున్నారు. జట్టును వీళ్లిద్దరూ ముందుండి నడిపిస్తారని అంతా భావిస్తుంటే.. వీరే టీమ్‌కు భారంగా మారుతున్నారు. రోహిత్, కోహ్లీ కారణంగానే న్యూజిలాండ్‌తో 0–3 తేడాతో టెస్ట్ సిరీస్, ఆ తర్వాత తాజాగా ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోపీలో (BGT) 3–1 తేడాతో ఓడిపోయామని.. ఈ ఇద్దరూ వెంటనే రిటైర్ కావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వరుస వైఫల్యాల నేపథ్యంలో ఈ ఇద్దరికి బీసీసీఐ వార్నింగ్ ఇచ్చిందని సమాచారం.
ఎంత పెద్ద ఆటగాళ్లయినా టీమ్ తర్వాతే..
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లో ఫెయిలైన రోహిత్ శర్మ, కోహ్లీకి బీసీసీఐ (BCCI) గట్టిగా హెచ్చరికలు పంపిందని సమాచారం. ఎంత పెద్ద ఆటగాళ్లైనా టీమ్ తర్వాతేనని.. జట్టు అవసరాలు, గెలుపే ముఖ్యమని బోర్డు పెద్దలు స్పష్టం చేశారట. వచ్చే చాంపియన్స్ ట్రోఫీనే (ICC Champions Trophy 2025) చివరి అవకాశమని, అందులో గానీ సరిగ్గా ఆడలేకపోతే కఠిన చర్యలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారట. సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ కూడా ఈ జోడీపై సీరియస్ అయ్యాడని తెలుస్తోంది. త్వరలో జరగబోయే మీటింగ్‌లో మరింత చర్చ సాగనుందని సమాచారం.
అలాంటిదేమీ లేదు: గంభీర్
అయితే ఈ విషయాన్ని టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కొట్టిపారేశారు. అలాంటిదేమీ లేదని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి మ్యాచ్ విన్నర్లతో బీసీసీఐ ఎప్పుడూ వినమ్రంగానే ఉంటుందని అన్నారు. ఒక సిరీస్‌లో బ్యాటర్ల పేలవ ప్రదర్శనతో వారిని జట్టును తొలగించలేమన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీతోపాటు జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.