
ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ చేసుకుంటే నొప్పి రాదా.. గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా? అంటూ వైద్యులు గర్భిణికి నరకం చూపించారు. సినిమాలు ఎక్కువగా చూస్తావా.. డైలాగులు చెప్తున్నావంటూ టార్చర్ చేసిన ఘటన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. గర్భిణీలకు డెలివరీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్న వైద్యుల బాగోతం తాజాగా వెలుగు చూసింది.
భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీలకు డెలివరీ చేసేందుకు వైద్య సిబ్బంది లంచం అడుగుతున్నట్లు ఓ మహిళ ఆరోపించింది. ఆసుపత్రిలో పురిటి నొప్పులు భరించలేకపోతున్నానని వేడుకున్నా వైద్యులు కనికరం చూపని లేదని వాపోయింది. నొప్పి గవర్నమెంట్ ఆసుపత్రిలోనే వస్తుందా? ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకో అని డాక్టర్లు తిడుతున్నారని పలువురు బాలింతలు ఆరోపిస్తున్నారు.
బిడ్డ బయటకు వచ్చే సమయంలో నొప్పిని భరించలేక వేడుకున్న గర్భిణీని మొదటి కాన్పు ప్రైవేట్ ఆసుపత్రిలో చూసుకున్నావా? అక్కడ నొప్పులు రాలేదా? సినిమాలు ఎక్కువ చూస్తావా, డైలాగులు చెప్తున్నావు అంటూ వైద్యురాలు ప్రమీలా రాణి వ్యంగ్యంగా మాట్లాడినట్లు ఓ బాలింత ఆరోపించింది. కాన్పు అయ్యాక బిడ్డను పక్కన పడేశారని.. ఆ తర్వాత ఎవరూ వారిని పట్టించుకోలేదని వాపోయింది.
రిజిస్టర్లో తమ పేర్లు కూడా తప్పుగా రాశారని.. పేర్లు సరిచేయమంటే లంచం అడుగుతున్నారని తెలిపింది. రోగులకు నీళ్ల పాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సదరు బాలింత భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల తీరుపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వైద్యుల తీరును తప్పుబడుతున్నారు. వెంటనే అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.