మహారాష్ట్రలో బుధవారం జరిగిన ఎన్నికలపై (maharashtra assembly elections 224) సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహాలో బీజేపీ సారథ్యంలోని మహాయుతి (mahayuti) కూటమి అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. జార్ఖండ్‌లోనూ బీజేపీనే వస్తుందని పేర్కొంటున్నాయి. రెండు రాష్ట్రాల ఎన్నికలు బుధవారం ముగియగా ఆ వెంటనే ఇరు రాష్ట్రాల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. బీజేపీ, శివసేన (షిండే వర్గం) ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగ్గా.. మహారాష్ట్రలో బుధవారం ఒకే విడతలో ముగిసింది.
ఒక్కటి మాత్రమే అఘాడీ వైపు
కాంగ్రెస్, శివసేన (యూబీటీ) ఎన్సీపీ (ఎస్పీ)లతో కూడిన విపక్ష మహా వికాస్ అఘాడీ ఈసారీ ఓడిపోనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ (exit polls) అంచనా వేశాయి. అన్ని పోల్స్ బీజేపీ కూటమి వైపు మొగ్గితే ఒక్క లోక్‌పోల్ మాత్రమే మహా వికాస్ అఘాడీ గెలుస్తుందని పేర్కొంది. 288 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆ కూటమి 150కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని, మహాయుతికి 130కి లోపే సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది. చాణక్య, టైమ్స్ నౌ, పీమార్క్, ఎలక్టోరల్ ఎడ్జ్, పోల్ డైరీ, పీపుల్స్ పల్స్, దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ మహాయతి వైపు మొగ్గుచూపాయి.
జార్ఖండ్‌లో టఫ్ ఫైట్
జార్ఖండ్‌లో అధికార జేఎంఎం–కాంగ్రెస్ కూటమికి, బీజేపీ సారథ్యంలోని విపక్ష ఎన్డీఏ కూటమికి మధ్య హోరాహోరీ సాగిందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. స్వల్ప మెజారిటీతో అధికారం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాయి. ఈ అంచనాల నేపథ్యంలో జార్ఖండ్‌లో చివరకు హంగ్ వచ్చినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే జేఎంఎం కూటమి గెలుస్తుందని అంచానా వేసింది. 81 స్థానాలకు గానూ 53 సీట్లలో గెలుస్తుందని పేర్కొంది. ఎన్డీఏ కూటమికి 25 సీట్లు మాత్రమే వస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఫలితాలపై ఆసక్తి నెలకొంది. ఫలితాలు రావాలంటే ఈ నెల 23 వరకు వేచి చూడాల్సిందే.







