జమ్ముకశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాం (Pahalgam Terror Attack) ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యటకులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉగ్రదాడిపై స్పందిస్తూ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఉగ్రవాదులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవడొస్తాడో రండి.. నా నెక్స్ట్ వెకేషన్ కశ్మీర్ లోనే అంటూ సవాల్ విసిరారు. ఉగ్రదాడి తర్వాత కశ్మీర్ పర్యటక రంగంపై పెను ప్రభావం పడింది. అక్కడికి వెకేషన్ కు వెళ్లాలనుకున్నవారంతా ఈ దాడి తర్వాత భయంతో దాన్ని రద్దు చేసుకుంటున్నారు.
నా నెక్స్ట్ వెకేషన్ కశ్మీర్ లోనే
ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి (Sunil Shetty) కశ్మీర్ పర్యటక రంగానికి మద్దతుగా నిలిచారు. శుక్రవారం రోజున లతీ దీనానాథ్ మంగేష్కర్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సునీల్ శెట్టి కశ్మీర్ పర్యటకం (Kashmir Toruism), ఉగ్రవాదుల గురించి మాట్లాడారు. ఉగ్రవాదులకు భారతీయులు భయపడరని చాటేందుకు కశ్మీర్ పర్యటక రంగాన్ని తిరిగి బలోపేతం చేసేందుకు తన నెక్స్ట్ వెకేషన్ కశ్మీర్ లోనే గడుపుతానని ఆయన ప్రకటించారు. విద్వేషాలు, భయాల ద్వారా సమాజాన్ని విడదీయాలని చూసే శక్తుల పట్ల భారతీయులంతా ఐక్యతను ప్రదర్శించాలని పిలుపునిచ్చారు.
మనమంతా ఐకమత్యం చాటాలి
“మానవ సేవే అతి పెద్ద దైవ సేవ. భారతీయులంతా ఐక్యంగా ఉండాల్సిన సమయమిది. భయాన్ని, ద్వేషాన్ని వ్యాప్తి చేసే వారి ఉచ్చులో మనం పడకూడదు. హిందూ-ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వారి మాటలను అసలే నమ్మొద్దు. కశ్మీర్ మనది.. అది ఎప్పుడూ మనదిగానే ఉంటుంది. ప్రజలందరూ తమ తర్వాతి సెలవులను కశ్మీర్‌లోనే ప్లాన్ చేసుకోవాలి. మనకు భయం లేదని వారికి చూపించాలి. అవసరమైతే కశ్మీర్‌ను సందర్శించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.” అని సునీల్ శెట్టి అన్నారు.






