వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) దూసుకుపోతోంది. అధ్వితీయమైన మెజార్టీలో విజయం వైపు అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన కేరళలోని వాయనాడ్ (Wayanad) లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ స్థానానికి ప్రియాంకా గాంధీ పోటీ చేయగా.. శనివారం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఆమె ప్రభంజనం సృష్టిస్తోంది. శనివారం మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆమెకు 5 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. 3.30 లక్షల ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. ప్రత్యర్థి సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరికి 1.7 లక్షల ఓట్లు వచ్చాయి. బీజేపీ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆ పార్టీ అభ్యర్థి నవ్య హరిదాస్‌కు 95 వేల ఓట్లు వచ్చాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ వరుసగా రెండోసారి ఈ సీటును గెలుచుకుని పార్లమెంటుకు చేరుకున్నారు. ఈసారి ఆయన లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌కు చెందిన సీపీఐ(ఎం) అభ్యర్థి అన్నీ రాజాపై 3 లక్షల 64 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి తన సభ్యత్వాన్ని నిలుపుకుంటూ వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. అందుకే రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ ఇక్కడ జరుగుతున్న ఉపఎన్నికలో మొదటిసారి పోటీ చేశారు.
పోటీలో వీరే..
వయనాడ్‌లో ఈసారి పోటీలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉన్నారు. పోటీలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్క్సిస్ట్ (CPM) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి సత్యన్ మొకేరి బరిలోకి దిగారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుంచి నవ్య హరిదాస్ కూడా పోటీ చేశారు. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 16 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో తేలిపోనుంది.