కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (justin trudeau) గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్ తో వివాదం, ఆపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అభాసుపాలవుతున్న ట్రూడో తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దేశమంతా ఆహార సంక్షోభం, నిరుద్యోగం, ద్రవ్యోల్భణంతో సతమతమవుతున్న వేళ ఓ ప్రముఖ గాయని మ్యూజిక్ కన్సర్ట్ లో స్టెప్పులేస్తూ ట్రూడో జాలీగా గడిపిన వీడియో ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
టేలర్ స్విఫ్ట్ కన్సర్ట్ లో ట్రూడో
అమెరికన్ (USA) పాప్ సూపర్ స్టార్ టేలర్ స్విఫ్ట్ (Taylor Swift) గురించి తెలియని వారుండరు. అయితే తాజాగా టేలర్ స్విఫ్ట్ కన్సర్ట్‌లో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) సందడి చేశారు. ఈ కన్సర్ట్ కు హాజరైన ఆయన పాటలు వింటూ ఎంజాయ్ చేశారు. అంతే కాకుండా టేలర్ సాంగ్ కు స్టెప్పులేస్తూ జాలీగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో (justin trudeau Dance Video) ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే కెనడా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న సమయంలో వాటిపై దృష్టి పెట్టకుండా దేశ ప్రధాని ఇలా జాలీగా గడపడటం పట్ల ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ట్రూడో డ్యాన్స్ వీడియో వైరల్
ముఖ్యంగా కెనడాలోని మాంట్రియల్‌లో పాలస్తీనా (Palestine)కు అనుకూలంగా పలువురు నిరసనకారులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీసిన సమయంలో ట్రూడో.. ఈ కాన్సర్ట్‌లో పాల్గొని స్టెప్పులు వేయడంపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్- హమాస్ (Israel-Hamas) యుద్ధంలో ఎంతో మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో పాలస్తీనా మద్దతుదారులు కెనడాలోని మాంట్రియల్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) దిష్టి బొమ్మతోపాటు పలు కార్లకు నిప్పు పెట్టారు.
ట్రూడోపై నెటిజన్ల విమర్శలు
నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు స్మోక్ బాంబులను ఉపయోగించారు. ఈ క్రమంలోనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే దేశమంతా ఇలా సమస్యల వలయంగా మారి, ఆందోళనలు (Protests in Canada) జరగుతున్న సమయంలో ట్రూడో డ్యాన్స్ చేస్తున్న వీడియో వెలుగులోకి రావడంతో నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మరికొందరు మాత్రం ట్రూడోకు మద్దతుగా నిలుస్తున్నారు.