
Mana Enadu : రేషన్ బియ్యం (Ration Rice Scam) మాయం వ్యవహారంలో వైస్సార్సీపీ (YSRCP) నేత, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani)పై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో ఏ6గా చేరుస్తూ మచిలీపట్నం తాలూకా పీఎస్‌లో పోలీసులు కేసు ఫైల్ చేశారు. మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో ఇప్పటికే పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారికి మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ జడ్జి 12 రోజుల రిమాండ్ విధించడంతో నిందితులను మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. ఇక ఈ కేసులో నిందితులుగా గోదాము మేనేజర్ మానస తేజ, పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, రైస్ మిల్లు యజమాని బొర్రా ఆంజనేయులు, లారీ డ్రైవర్ మంగరాజు ఉన్నారు.
సతీమణి జయసుధకు నోటీసులు
ఈ కేసులో దూకుడు పెంచిన అధికారులు పేర్ని నాని సతీమణి జయసుధ (Perni Jayasudha)కు నోటీసులు జారీ చేశారు. గోదాములో బియ్యం మాయంపై ప్రాథమిక విచారణ చేపట్టిన పౌరసరఫరాల శాఖ అధికారులకు తొలుత 185 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం షార్టేజీ రాగా.. జయసుధ రూ.1.68 కోట్లు జరిమానా చెల్లించారు. తాజాగా పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టిన అధికారులు మొత్తం 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్లు తేల్చి.. అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ మరోసారి నోటీసులు జారీ చేశారు.