పాకిస్థాన్‌తో సీజ్‌ఫైర్(Ceasefire) ఒప్పందానికి సంబంధించి తాజాగా ఇండియన్ ఆర్మీ(Indian Army) కీలక ప్రకటన విడుదల చేసింది. నేటితో కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తుందన్న వార్తలను ఖండించింది. భారత్, పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO’s)ల మధ్య ఆదివారం ఎలాంటి చర్చలకు ప్లాన్ చేయలేదని తెలిపింది. కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని ప్రకటించింది. ఈ నెల 12న ఇరు దేశాల డీజీఎంఓల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతానికి కొనసాగుతాయని ఇండియన్ ఆర్మీ స్పష్టం చేసింది.
అంతర్జాతీయంగా పాక్‌ను ఎండగట్టేందుకు..
ఇక, పహల్గామ్ ఉగ్రదాడి(Pahalgam Terror Attack)కి ప్రతీకారంగా భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation SIndoor)తో దాయాది పాకిస్థాన్ వణికిపోయిన విషయం తెలిసిందే. ఎదురుదాడికి ప్రయత్నించినప్పటికీ భారత బలగాల దెబ్బకు తోకముడిచింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారత్ అంగీకరించింది. దాంతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. కాగా పాకిస్థాన్ వక్రబుద్ధిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ నుంచి ఏడు బృందాలు ఇవాళ తరలివెళ్లిన విషయం తెలిసిందే.






